జయాపజయాలతో సంబంధం లేకుండా అక్కినేని నాగ చైతన్య తన కెరీర్ ను ఒక లెవెల్లో సెట్ చేసుకుంటూ వెళుతున్నాడు. అవకాశం వచ్చినప్పుడు ప్రేమమ్ వంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ కూడా అందుకుంటున్నాడు. అయితే మొదటి నుంచి చైతు టార్గెట్ తన కెరీర్ లో ఒక యాక్షన్ కథతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాలని అనుకుంటున్నాడు. 

ప్రస్తుతం ఆ కోరిక నెరవేర్చుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే దసరాతో సందడి చేసిన సినిమాల హవా ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. అరవింద సమేత - పందెం కోడి - హలో గురు ప్రేమ కోసమే కలెక్షన్స్ తగ్గాయి. ఆడియెన్స్ ఒక డిఫరెంట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. 

ఈ సమయంలో సవ్యసాచి లాంటి డిఫరెంట్ సినిమా రిలీజ్ అవుతుండడం కలిసొచ్చే అంశం. గత వారం రిలీజైన వీర బోగ వసంత రాయలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. సవ్యసాచికి ఇప్పుడు పోటీగా పెద్ద సినిమాలు లేవు. దీంతో సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుందని చెప్పవచ్చు. 

కార్తికేయ - ప్రేమమ్ సినిమాలతో మెప్పించిన చందు మొండేటి సినిమాకు దర్శకత్వం వహించడం అలాగే టీజర్ ట్రైలర్ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయి. దానికి తోడు మైత్రి మూవీ మేకర్స్ ప్రమోషన్స్ డోస్ పెంచడానికి ట్రై చేస్తోంది. 

చైతు కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా అత్యధిక థియేటర్స్ లో సవ్యసాచి రిలీజ్ కాబోతోంది. హిట్టు పడితే చైతు మార్కెట్ పెరుగుతుంది. ముందు ముందు భారీ బడ్జెట్ సినిమాల్లో నటించే అవకాశం ఉంటుంది.  మరి సినిమా ఏ స్థాయిలో వసూళ్లను రాబడుతుందో చూడాలి.