అలనాటి స్టార్ హీరోయిన్ కన్నుమూత.. సీఎం దిగ్భ్రాంతి..
చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బెంగాలీ నటి కన్నుమూశారు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె తుది శ్వాస విడిచారు.
చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి కన్నుమూశారు. బెంగాల్‌కి చెందిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీల మజుందర్(65) మరణించారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె కోల్‌కత్తాలోని తన నివాసంలో శనివారం తుది శ్వాస విడిచారు. ఆమెకి భర్త, కొడుకు ఉన్నారు. నటి శ్రీలా మజుందర్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఆమె చిత్ర పరిశ్రమకి చేసిన సేవలను కొనియాడారు. భారతీయ చిత్రాల్లో అనేక విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించిన శ్రీలా మరణం బెంగాల్ చిత్ర పరిశ్రమకి తీరని లోటు అని వెల్లడించారు. కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు.
బెంగాల్ నటి శ్రీల మజుందర్ ముందుతరం నాయిక. 1980లో నటిగా కెరీర్‌ని ప్రారంభించింది శ్రీల. ఆప్పటికి ఆమె వయసు 16 ఏళ్లే. నటిగా కెరీర్ మొదలుపెట్టిన శ్రీలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. `ఏక్దిన్ ప్రతిదిన్` (క్వైట్ రోల్స్ ది డాన్, 1980), `ఖరీజ్` (ది కేస్ ఈజ్ క్లోజ్డ్, 1982), `అకలేర్ సంధానే` (ఇన్ సెర్చ్ ఆఫ్ ఫామిన్; 1981) వంటి సినిమాలు శ్రీలకి విశేష గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇందులో ఆమె పాత్రలు ఆడియెన్స్ ని విశేషంగా మెప్పించాయి. ఆడియెన్స్ కి దగ్గర చేశాయి.
లెజెండరీ దర్శకుడు మృణాల్ సేన్ రూపొందించిన చాలా సినిమాల్లో శ్రీల హీరోయిన్‌గా నటించింది. అవన్నీ చాలా వరకు హిట్ అయ్యాయి. బెంగాలీ ఇండస్ట్రీలో ఐకానిక్‌గానూ నిలిచిపోయాయి. `ఏక్దిన్ ప్రతిదిన్` మువీకి సీక్వెల్‌గా వచ్చిన ‘కౌశిక్ గంగూలీ’ ఆమె చివరి మువీ. ఈ మువీ గతేడాది విడుదలైంది. శ్రీలా తన కెరీర్‌లో మొత్తం 43 సినిమాల్లో నటించింది. రితుపర్ణో ఘోష్ రచించిన చోఖేర్ బాలి (ఏ ప్యాషన్ ప్లే, 2003) లో ఐశ్వర్య రాయ్‌కి ఆమె వాయిస్ డబ్బింగ్ అందించారు.
శ్రీల మజుందర్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె గత మూడేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. నెల రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే కొన్నాళ్లు హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న ఆమె ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో ఇంటికి తీసుకొచ్చేశారు. కానీ అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్తను నటి భర్త, జర్నలిస్టు ఎస్ఎన్ఎమ్ అబ్ది మీడియాకు వెల్లడించారు. శ్రీలా మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.