బెల్లి లలిత కుటుంబం సినిమాపై అభ్యంతరం తెలపడానికి కారణమేంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమాలో దర్శకుడు ఏం చూపించాడనేది తెలుసుకునేందుకు అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

తెలంగాణలో కొన్నేళ్లపాటు తిరుగులేని గ్యాంగ్‌స్టర్‌గా రాణించారు నయీం(Nayeem). మావోయిస్టు నుంచి పోలీస్‌ కోవర్ట్ గా మారి, ఆ తర్వాత పోలీసుల అండతో గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగారు నయీం. రాజకీయ నాయకులు, పోలీసులు పెంచిన పోషించిన నయీం.. తిరిగి వారికే అడ్డంకిగా మారిన నేపథ్యంలో ఆయన్ని 2016లో ఎన్‌కౌంటర్‌ చేశారు పోలీసులు. తెలంగాణ ప్రభుత్వమే ఈ ఎన్‌కౌంటర్‌ చేయించిందనే వార్తలొచ్చాయి. అప్పట్లో దుమారం రేపిన నయీం జీవితం ఆధారంగా తాజాగా `నయీం డైరీస్‌`(Nayeem Diaries) సినిమాని రూపొందించారు దర్శకుడు దాము బాలాజీ. నయీం పాత్రలో `కేజీఎఫ్‌` ఫేమ్‌ వశిష్ట సింహా నటించారు. ఈ సినిమా నేడు శుక్రవారం విడుదలైంది. 

అయితే Nayeem Diaries Movie నిలిపివేయాలని బెల్లి లలిత కుటుంబ సభ్యులు తెలంగాణ హైకోర్ట్ ని ఆశ్రయించారు. ఈ సినిమాలో ఉద్యమకారిణి బెల్లిలలిత పాత్రని అభ్యంతరకరంగా చూపించారని ఆరోపిస్తూ సినిమా విడుదల నిలిపివేయాలని వారు శుక్రవారం కోర్ట్ ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్ట్ సినిమా విడుదలని ఆపివేయాలని తీర్పునిచ్చింది. ఈ మేరకు కోర్ట్ దర్శకుడు దాము బాలాజీ, నిర్మాత సీఏ వరదరాజులకు నోటీసులు జారీ చేసింది. బెల్లిలలిత పాత్రని చూపించిన విధానంపై వివరణ ఇవ్వాలని తెలిపింది. 

అయితే బెల్లి లలిత కుటుంబం సినిమాపై అభ్యంతరం తెలపడానికి కారణమేంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమాలో దర్శకుడు ఏం చూపించాడనేది తెలుసుకునేందుకు అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సినిమాలో బెల్లిలలిత పాత్రని లత పాత్ర రూపంలో చూపించారు. కన్నడ నటి సంయుక్త హర్నాడ్‌ ఈ పాత్రలో నటించారు. ఇందులో ఆమె నయీంని ఇష్టపడే పాత్రలో కనిపిస్తుంది. నయీం అంటే పడిచచ్చేలా ఆమె పాత్ర సాగుతుంది. అదే సమయంలో ఆమె మావోలకు కోవర్ట్ గా పనిచేసే పాత్రలో కనిపిస్తుంది.

నయీంపై మోజు పడటం, కోర్ట్ సన్నివేశంలో ఏకంగా నయీం, లత పాత్ర లిప్‌కిస్సులు పెట్టుకోవడం బోల్డ్ గా ఆవిష్కరించారు. నయీం జైలు నుంచి విడుదల కావాలని, బయటకు రావాలని తపిస్తుంది. ఆయన బయటకు వచ్చాక పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అవుతారు. లత పాత్ర వీక్‌నెస్‌ నయీం. అతనంటే పడి చస్తుందని తెలిసిన పోలీసులు.. ఆమె ద్వారా మావోయిస్టుల కీలక నాయకుడు వీరన్నని పట్టించాలని, అందుకు లతని పావుగా వాడుకోవాలని నయీంకి చెబుతున్నారు పోలీసులు. ఓ మావోయిస్టు హత్య కేసులో నింధితురాలిగా ఉన్న నయీం అక్కని అరెస్ట్ చేస్తామని, వీరన్నని లత ద్వారా తమకి పట్టిస్తే, వదిలేస్తామని, లేదంటే జైలుకి వెళ్లాల్సి వస్తుందని నయీంని పోలీసులు బెదిరిస్తుంటారు. 

దీంతో వీరన్నని పట్టించాలని లతని రిక్వెస్ట్ చేస్తాడు నయీం. వీరన్నని పట్టిస్తే, తాను విడుదలవుతానని, దీంతో పెళ్లి చేసుకుని హాయిగా ఉందామని లతకి చెబుతాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోదు. ఆయన్ని నమ్మదు. పలుమార్లు చెప్పినా ఆమె వీరన్నని పట్టించకపోవడంతో కోపానికి గురైన నయీం.. తన తమ్ముడు, అక్క, అమ్మలతో కలిసి లతని చంపిస్తాడు. వాళ్లు ఆమెని చంపి బాడీని ముక్కలు ముక్కలుగా చేసి భువనగిరి సమీపంలోని ఒక్కో బావి వద్ద ఒక్కో ముక్క వేస్తారు. ఈ హత్య అత్యంత సంచలనం సృష్టిస్తుంది. ఇలా బెల్లి లలితని నయీంపై మోజు పడే అమ్మాయిగా చూపించే విషయంలోనే ఆమె కుటుంబ సభ్యులు `నయీం డైరీస్‌` సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక ఉద్యమకారిణిని ఇలా అభ్యంతరకరంగా చూపించడం పట్ల వాళ్లు అభ్యంతరం తెలియజేస్తున్నట్టు తెలుస్తుంది. 

also read: బెల్లి లలిత పాత్రపై అభ్యంతరాలు, నయీం డైరీస్‌ చిత్రయూనిట్‌కు షాక్.. ప్రదర్శనపై తెలంగాణ హైకోర్ట్ స్టే

అయితే దీనిపై చిత్ర దర్శక నిర్మాతలు స్పందించారు. బెల్లిలలిత కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలుపుతున్న సన్నివేశాన్ని, ఆయా డైలాగ్‌లను తొలగిస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఓ నోట్‌ని పంచుకున్నారు దర్శక నిర్మాతలు దాము బాలాజీ, సీఏ వరదరాజు‌. `శుక్రవారం విడుదలైన `నయీం డైరీస్‌` సినిమాలో నిజజీవితంలో అమరురాలైన ఒక మహిళని పోలిన పాత్ర చిత్రణ ఆమె కుటుంబ సభ్యులను, అభిమానుల్ని బాధపెట్టినట్టు మా దృష్టికి వచ్చింది. వారి మనో భావాల్ని గౌయపరిచినందుకు మేం భేషరతుగా క్షమాపణ చెబుతున్నాం. మా సినిమా ప్రదర్శనను ఆపివేసి,ఆ పాత్రకు సంబంధించిన అభ్యంతరకర దృశ్యాలను, సంభాషణలను వెంటనే తొలగిస్తున్నామని తెలియజేస్తున్నాం` అని దర్శకుడు దాము బాలాజీ, నిర్మాత సీఏ వరదరాజు తమ ప్రకటనలో తెలిపారు. 

Scroll to load tweet…