బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో చెప్పుకోదగ్గ ఒక్క హిట్టూ లేదు.  కానీ అతని సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం బాగా చేస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా చేస్తున్న ‘సీత’ కూడా మంచి బిజినెస్ చేసింది. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం థియేట్రకల్ రైట్స్ ను 18 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నారు.  డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ద్వారా కూడా మంచి ఎమౌంటే నిర్మాతకు వెళ్లిందని వినికిడి. దాంతో నిర్మాత చాలా ఉషారుగా ఉన్నారు. 

ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న విభిన్న కథా చిత్రం  ‘సీత’. ఈ  సినిమాలో  బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్‌ జంటగా నటిస్తున్నారు.  అలాగే కాజల్‌ నెగిటివ్‌రోల్‌ పోషిస్తున్న ఈ సినిమాలో సోనూ సూద్‌ చాలా కాలం తరువాత మళ్లీ  తెలుగు సినిమాలో కనిపించటం విశేషం.

తేజ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీకళ్యాణం’ చిత్రంతోనే తెలుగు తెరకు పరిచయమైంది కాజల్‌. మళ్లీ పదేళ్ల తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’తో ఇద్దరూ కలిసి   విజయాన్ని అందుకొన్నారు. కాజల్‌ యాభయ్యో సినిమా అది. మళ్లీ ఇలా ‘సీత’ కోసం ముచ్చటగా మూడోసారి కలిశారు.  సక్సెస్ ఫుల్ కాంబినేషన్  కాబట్టి ‘సీత’పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

అలాగే కాజల్‌-బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న రెండో చిత్రమిది. గతంలో వీరిద్దరూ ‘కవచం’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకుంది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. అనిల్‌ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్‌ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.