బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు చిత్రం గత శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ బెల్లంకొండ అబ్బాయి కెరీర్ ఆరంభం నుంచి ఓ మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ దక్కలేదు. దీనితో ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని తమిళ సూపర్ హిట్ చిత్రం రాక్షసన్ రీమేక్ లో నటించాలని డిసైడ్ అయ్యాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో రాక్షసుడుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

తొలి షో నుంచే రాక్షసుడు చిత్రానికి అదిరిపోయే పాజిటివ్ టాక్ వచ్చింది. సీట్ల అంచున కూర్చుని చూసే థ్రిల్లర్ అంటూ ప్రశంసలు దక్కాయి. కానీ శ్రీనివాస్ గత చిత్రాల ప్రభావం వల్ల తొలి రోజు రాక్షసుడు ఓపెనింగ్స్ యావరేజ్ గా నమోదయ్యాయి. దీనితో ఈ చితం ఫుల్ రన్ లో సేఫ్ అవుతుందా లేదా అనే అనుమానాలు తలెత్తాయి. 

కానీ పాజిటివ్ టాక్ పెరుగుతుండడంతో శని, ఆదివారాల్లో రాక్షసుడు చిత్రానికి మంచి వసూళ్లు నమోదయ్యాయి. తొలి రోజు కంటే ఆదివారం ఈ చిత్ర వసూళ్లు పెరగడం విశేషం. మూడు రోజుల్లో రాక్షసుడు చిత్రం 6.65 కోట్ల షేర్ రాబట్టింది. ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ 16 కోట్ల వరకు ఉంది. సోమవారం నుంచి ఈ చిత్రం స్టడీగా బాక్సాఫీస్ రన్ కొనసాగిస్తే తొలి వారంలోనే బయ్యర్లు గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

నైజాంలో ఈ చిత్రం 2.3 కోట్ల షేర్, సీడెడ్ లో 85 లక్షలు, ఉత్తరాంధ్రలో 86 లక్షలు, గుంటూరులో 51 లక్షలు, కృష్ణలో 44 లక్షల షేర్ రాబట్టింది. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్ నటించింది. రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటించాడు. జిబ్రాన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రంలో ఓ హైలైట్.