టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన 'సీత' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న బెల్లంకొండ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

తను ఏ కథకు ఓకే చెప్పాల్సి వచ్చినా.. ముందుగా ఆ కథను తన తండ్రి బెల్లంకొండ సురేష్ తో కలిసి వింటానని ఆయన అభిప్రాయం తెలుసుకున్న తరువాతే సినిమాకు ఓకే చెబుతానని అన్నాడు. కానీ 'సీత' సినిమా విషయంలో తన తండ్రి మాటకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.

ముందుగా దర్శకుడు తేజ తనకు రెండు కథలు వినిపించాడని, అందులో 'సీత' కంటే మరో కథ తన తండ్రికి బాగా నచ్చిందని, కానీ తనకు మాత్రం 'సీత' కథ నచ్చడంతో నాన్న వద్దంటున్నా ఓకే చెప్పానని తెలిపాడు. ఇలా తన కెరీర్ లో మొదటిసారి తన తండ్రి అభిప్రాయానికి వ్యతిరేకంగా 'సీత' సినిమా చేశానని చెప్పుకొచ్చాడు.

అందుకే సినిమా పెద్ద హిట్ అవ్వాలని బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా తనకు ఈ సినిమా రిజల్ట్ పై బెంగలేదంటున్నారు.. మంచి సినిమా చేశాననే తృప్తి తనకు కలిగిందని చెబుతున్నారు.