బాలయ్య చిత్రం రైట్స్ ...దిమ్మ తిరిగే రేటుకు దిల్ రాజు
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిబి3 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సింహా, లెజండ్ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ అందుకోవడం ఖాయం అని ట్రేడ్ లెక్కలు వేస్తోంది. ఈ సినిమాను మే 28న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరుగుతోంది అనేది మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ట్రేడ్ లో చెప్పుకునే లెక్కలు ప్రకారం ఈ సినిమా అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. దిల్ రాజు ఈ చిత్రం నైజాం, వైజాగ్ ఏరియాల రైట్స్ నిమిత్తం ఇరవై కోట్లు కోట్ చేసారని తెలుస్తోంది. దిల్ రాజు ఎప్పుడైతే సీన్ లోకి వచ్చారో మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఎలర్ట్ అయ్యిపోతారు. వారు కూడా ఫ్యాన్సీ రేట్లుతో ముందుకు వస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు క్రేజ్ మామూలుగా లేదని, ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం పబ్లిసిటీ మెటిరియల్ సినిమా పై అంచనాలు పెంచేయటం కలిసొస్తోంది.
ఈ సినిమాలో బాలకృష్ణ నిక్కిచ్చిగా,ముక్కు సూటిగా ముందుకెళ్లే ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపిస్తారని, అలాగే అఘోరాగా మరో పాత్రలోనూ కనపడతారని వినికిడి. ఇప్పటికే బయిటకు వచ్చిన టీజర్ దుమ్ము రేపింది. ప్రస్తుతం ఈ చిత్రం 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కరోనా అన్‌లాక్ తర్వాత మొదలైన ఈ చిత్రం ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. మిగిలిన 40 శాతం షూటింగ్‌కి సంబంధించిన షెడ్యూల్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి మొదలు కానుంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను బోయపాటి చిత్రీకరించనున్నారు. మొత్తం ఈ చిత్రానికి అరవై కోట్లు దాకా బడ్జెట్ అవుతున్నట్లు సమాచారం.
ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు దర్శకనిర్మాతలు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంది. యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు బాలయ్య. అందులో ఒకటి అఘోరా పాత్ర కావడంతో భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.