స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదలైన అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ తో పాటుగా వచ్చిన మరో బాలీవుడ్ చిత్రం జాన్ అబ్రహం బాట్లా హౌస్.

రిలీజ్ కు ముందు మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం  డీసెంట్ ఓపెనింగ్స్ తో పాటు మంచి రివ్యూలు సొంతం చేసుకుంది. మిషన్ మంగళ్ ఇప్పటికే సేఫ్ ప్రాజెక్ట్ దిశగా అడుగులు వేస్తూంటే 'బాట్లా హౌస్' మాత్రం ఓ వర్గాన్ని బాగానే ఆకర్షిస్తోంది. 

బాట్లా హౌస్ కథ  విషయానికి వస్తే...ఏసీపీ సంజయ్‌ కుమార్ (జాన్‌ అబ్రహాం) తన టీమ్ తో కలిసి దిల్లీలోని బాట్లా హౌస్‌లో ఎన్‌కౌంటర్‌లో పాల్గొంటాడు. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా, ఒకర్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకుని, పారిపోతారు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని మీడియా, రాజకీయ నాయకులు, కొందరు కార్యకర్తలు ఆరోపణలు చేస్తారు. పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయి. ఆ తర్వాత ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ కాదని సంజయ్‌ కుమార్‌ నిరూపించగలిగాడా? లేదా?.. అనేది తెరపై చూడాలి.

కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే బాట్లా హౌస్ అద్భుతమైన కథ. విడివిడిగా భాగాలుగా చూస్తే కట్టిపడేసే ఎపిసోడ్స్ కొన్ని ఉన్నాయి. దర్శకుడు ఎటువంటి తడబాటు లేకుండా కథను స్పష్టంగా తెరపై చూపించారు. సినిమాలో వచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకుడిని థ్రిల్‌కు గురి చేస్తాయి. దీని తర్వాత ఏం జరుగుతుంది? అనే ఇంట్రస్ట్ ను కలిగిస్తాయి.

కానీ, సెకండాఫ్ లో  కథలో వేగం తగ్గుతుంది. న్యాయస్థానం చుట్టూ సాగే సీన్స్ నెమ్మదిగా సాగుతాయి. కోర్టులో చెప్పే కొన్ని డైలాగ్‌లు బాగుంటాయి. నోరా ఫతేహీ ఐటం సాంగ్ కథకు కాస్త బ్రేక్ వేస్తుంది. పాటను మినహా ఇస్తే.. కథ మొత్తం సీరియస్‌ ట్రాక్‌పైనే నడుస్తుంది. ఈ సినిమా మల్టిఫ్రెక్స్ లకు బాగా పడుతోంది.