ప్రముఖ గాయకుడు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ బప్పీ లహరికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. కోవిడ్‌ 19 పాజిటివ్‌ రావడంతో వెంటనే ఆయన్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం. ఇటీవల ఆయన్ని కలిసిన వారందరు పరీక్షలు చేయించుకోవాలని తేలియజేశామని బప్పీలహరి అధికార ప్రతినిధి చెప్పారు. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. బప్పీలహరి త్వరగా కోలుకోవాలని అతని అభిమానులు, స్నేహితులు కోరుతూ సందేశాలు పంపిస్తున్నారు. వేడుకుంటున్నారు. ఇదిలా ఉంటే బప్పీలహరి మార్చి మొదటి వారంలోనే కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు తన పేరును రిజిస్టరు చేసుకున్నారు. కానీ ఆయన వ్యాక్సినేషన్‌ చేయించుకోలేదు. అంతలోనే కరోనా సోకింది. బప్పీలహరితో పాటు బాలీవుడ్ నటులు పరేష్ రావల్, అమీర్ ఖాన్, ఆర్ మాధవన్, సతీష్ కౌశిక్, కార్తిక్ ఆర్యన్ లు ఇటీవల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే.

బప్పీల హరి పాపులర్‌ గాయకుడిగా, మ్యూజిక్‌ కంపోజర్‌గా రాణిస్తున్నారు. ఆయన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ వంటి భాషల్లో పాటలు పాడటం, సంగీతం అందించడం చేశారు. తనదైన సంగీతంతో ఇండియన్‌ మ్యూజిక్‌లో ప్రత్యేకమైన గుర్తింపుని సాధించారు.