బండ్ల గణేష్ ఇప్పుడిప్పుడే మళ్లీ తిరిగి నిర్మాతగా బిజీ అవ్వటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతో ఉత్సాహంతో కాంగ్రేస్ కండువా కప్పుకుని రాజకీయాల్లోకి వెళితే అక్కడా నడవలేదు. ఆ తర్వాత కెరీర్ ని తిరిగి ప్రారంభిద్దామని రీసెంట్ గా వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఓ పాత్ర చేస్తే అది క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు మళ్లీ నిర్మాతగా సినిమాలు ప్రారంభిద్దామా అనే ఆలోచలు చేస్తున్న సమయంలో కరోనా పెద్ద దెబ్బ కొట్టింది. ఆయనకు ఆర్దికంగా వెన్నుదన్నుగా ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ ని కరోనా చావు దెబ్బ కొట్టింది. ఈ నేపధ్యంలో తనను నిలబెట్టిన సినీ పరిశ్రమనే నమ్ముకుందామనుకుంటున్నారు. 

అయితే సినీ పరిశ్రమలో ఏ విధమైన వివాదాలు లేకపోతేనే రిలేషన్స్ బాగుంటాయి. ఈ విషయం బండ్ల గణేష్ కు బాగా తెలుసు. అయితే సోషల్ మీడియా జనం ఊరుకోరు కదా..ఏదో విధంగా కెలుకుదామనే ట్రై చేస్తున్నారు. తెలంగాణాలో రాజకీయాలు హీటేక్కిస్తున్న ఈ సమయంలో  బండ్ల గణేష్ ను కొంతమంది మళ్లీ రాజకీయాలు లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మాట్లాడిన గత వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దాంతో సోషల్ మీడియా వేదికగా ఆయనో రిక్వెస్ట్ చేసారు. రాజకీయాలను శాశ్వతంగా వదిలేసానని పలు మార్లు కన్ఫర్మ్ చేసానని గుర్తు చేస్తున్నారు.

 బండ్ల గణేష్ ట్వీట్ చేస్తూ “నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు .నేను రాజకీయాలకు దూరం .దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన మీ బండ్ల గణేష్” అంటూ వారందరినీ రిక్వెస్ట్ చేశారు.