బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే తెలుగులో రెండు సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు మూడో సీజన్ కోసం సిద్ధమవుతోంది. మొదటి రెండు సీజన్ లు జూన్, జూలై నెలల్లోనే మొదలయ్యాయి. కానీ ఈసారి ఇంకాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. 

మూడో సీజన్ ను నాగార్జున హోస్ట్ చేయబోతున్నారని సమాచారం. కంటెస్టంట్స్విషయంలో నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాస్త పేరు, హైప్ ఉన్న సెలబ్రిటీలను తీసుకురానున్నారు. ఈ క్రమంలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి బండ్ల గణేష్ పేరు కూడా చేరింది.

బండ్ల గణేష్ పేరుందని తెలియగానే ఇదొక హాట్ టాపిక్ గా మారింది. కమెడియన్ గా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి మరింత కామెడీ చేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే బ్లేడ్ తో పీక కోసుకుంటానని చెప్పిన ఆయన పార్టీ ఓడిపోవడంతో రాజకీయాల నుండి తప్పుకున్నాడు.

దీంతో సోషల్ మీడియాలో ఆయన్ని ఏకిపారేశారు. అతడిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తే షోకి క్రేజ్ వస్తుందని భావించారు. ఇదే విషయమై బండ్ల గణేష్ ని సంప్రదిస్తే దానికి ఆయన నో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తను నిర్మాతగా సినిమా చేస్తున్నానని, షో కోసం సమయం కేటాయించలేనని చెప్పి ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్ ఎక్కువ ఆఫర్ చేసినా బండ్ల గణేష్ మాత్రం ఒప్పుకోలేదట.