దాచేపల్లిలో జరిగిన ఘటనను నిరసిస్తూ విశాఖపట్నంలో ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తిపై  విమర్శలు చేశారు. ఆయన మహిళల్ని వేధిస్తున్నారంటూ ఆరోపించారు. దీంతో బండారు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. రోజా క్యారెక్టర్ ఏంటో… ఆమె చరిత్ర ఏంటో… చెన్నైలో ఆమె వేసిన వేషాలేంటో తమకు తెలుసని… వాటిని బయటపెట్టాలా అని రోజాకు సవాల్ విసిరారు. జబర్థస్త్‌లో ఆమె వేసే వేషాలు అందరికి తెలుసని… నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే గుండు కొట్టిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


రోజా వ్యక్తిగత విషయాల గురించి తానెప్పుడూ మాట్లాడలేదని… ఆమె మాట్లాడితే… తాము ఆమె చరిత్ర మొత్తం బయటపెడతామన్నారు. రోజా తనపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పకపోతే… తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 36 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఎలాంటి మచ్చలేదని… ఎన్నికల సమయంలో కేసులు తప్ప ఏ పోలీస్ స్టేషన్‌లో కేసులు లేవన్నారు. ఏ మహిళా తనపై ఫిర్యాదు చేయలేదని… ఒకవేళ కేసు ఉందని నిరూపిస్తే గుండు గీయించుకుంటానన్నారు. రోజాకు దమ్ముంటే తనపై వేధింపుల కేసు నిరూపించాలని ఆయన ఛాలెంజ్ విసిరారు.