ప్రపంచ దేశాలన్నింటిని కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. భారత దేశంలోనూ ఎంతో మంది  ప్రాణాలు కోల్పోయారు.  అయితే ప్రజలు  జీవనోపాధి కోల్పోకూడదనే లాక్‌డౌన్‌ని ఎత్తేసింది ప్రభుత్వం. ఈ నేపధ్యంలో షూటింగ్ లు ఫర్మిషన్స్ ఇవ్వాలా..థియేటర్స్ ఓపెన్ చెయ్యాలా అనే విషయమై గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి నేతృత్వంలో జరిగిన చర్చలకు బాలయ్యని పిలవకపోవటం కూడా వివాదాస్పదమైంది. ఈ నేపధ్యంలో బాలయ్య ..ఈ కరోనా సిట్యువేషన్ పై ఏ కామెంట్ చేసారనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.

కరోనా వేళ తనకేమీ కాదని నమ్ముతున్నానని, షూటింగుకు తాను ఎప్పుడైనా రెడీ అని  టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇంట్లోంచి బయల్దేరే ముందు పూజలు అవీ చేస్తానని, మంత్రాలు చదువుతానని వెల్లడించారు. వందలమందితోనైనా షూటింగ్ నిర్వహించేందుకు తాను సిద్ధమేనని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి వైరస్ లు తననేమీ చేయలేవని, తన నమ్మకాలు తనవని స్పష్టం చేశారు. ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ఈ విధమైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అలాగే షూటింగ్ లు ప్రారంభమైతే ఒకట్రెండు రోజులు భౌతికదూరం పాటిస్తారని, ఆ తర్వాత అందరూ మర్చిపోతారని, ఇది కొంచెం రిస్క్ తో కూడుకున్న విషయం అని బాలయ్య అభిప్రాయపడ్డారు. సాఫ్ట్ వేర్ ఆఫీసుల్లో ఎవరి క్యూబ్ లో వారు కూర్చుని పనిచేసుకుంటారని, సినిమా ఇండస్ట్రీ అలాకాదని వివరించారు.  మూడ్నాలుగు నెలలు షూటింగులు జరగకపోవచ్చని వెల్లడించారు. అంతేకాదు, కరోనా మహమ్మారి పోవాలంటే 2022 వరకు వేచి చూడకతప్పదని అన్నారు. 

ఇక ఈ నెల‌ 10న సినీనటుడు నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో రూపొందించిన ఓ కామన్ డీపీ సోషల్ మీడియాల్లో ట్రెండింగ్‌లో నిలిచింది. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు ఈ డీపీని షేర్‌ చేశారు. బాలకృష్ణ నటించిన రెండు సినిమాల్లోని లుక్‌లతో దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో శ్రీకృష్ణదేవరాయ పాత్రకూడా ఉంది.

ప్రస్తుతం బాలకృష్ణ  బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆయన ఈ సినిమా కోసం స్వయంగా ఓ పాట పాడారని అంటున్నారు. అలాగే ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది.  ఆయన నటిస్తోన్న106వ సినిమా ఇది.