బాలయ్య 'పంది' డైలాగు..ఆ ఎమ్మల్యే గురించా?
‘‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్దీ’’.. ఇదీ బాలయ్య చాలా ఆవేశంగా చెప్పిన డైలాగ్.
బాలయ్య సినిమా అంటే పవర్ ఫుల్ డైలాగులు వర్షమే. అడుగడక్కీ అదిరిపోయే డైలాగులతో ఆయన ఫ్యాన్స్ కు పండుగ చేస్తూంటారు. ముఖ్యంగా ఆ డైలాగులు చెప్పేటప్పుడు ఆయన చూపే ఎక్సప్రెషన్స్ అయితే ఓ రేంజిలో ఉంటాయి. అందుకే ఆయనకు డైలాగులు రాసేటప్పుడు ఆచి తూచి అక్షరం అక్షరం ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ఆ డైలాగులు విమర్శలు పాలవుతూంటాయి. తాజాగా బాలయ్య నుంచి వచ్చిన ఓ డైలాగు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే...బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభమైనా టైటిల్‌ని ప్రకటించకుండా ఆసక్తిని పెంచింది చిత్ర టీమ్. ఉగాది పండగని పురస్కరించుకుని ఆ ఉత్కంఠకు తెరదించుతూ ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ అందించింది. ఈ చిత్రానికి ‘అఖండ’ అనే పేరు ఖరారు చేస్తూ ఓ వీడియోను షేర్ చేసారు. బాలయ్య నెవర్ బిఫోర్ లుక్‌తో చాలా పవర్ ఫుల్‌గా కనిపించిన టీజర్ నందమూరి అభిమానులనే కాదు.. మాస్ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుందనటంలో సందేహం లేదు. అయితే ఇందులో ‘కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ పైనే అంతటా చర్చ జరుగుతోంది.
‘‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్దీ’’.. ఇదీ బాలయ్య చాలా ఆవేశంగా చెప్పిన డైలాగ్. పంది రంగులు మార్చటం ఏమిటి అంటున్నారు. తమ పార్టీ నుంచి వెళ్లి అధికార పక్షంలో చేరిన ఓ ఎమ్మల్యేని ఉద్దేశించి ఈ డైలాగు అని సోషల్ మీడియాలో హోరున శబ్దంలా వినపడుతోంది. అందులో నిజమెంతో తెలియదు కానీ ముందు ఆ డైలాగు చాలా మందికి అర్దం కావటం లేదు అంటున్నారు. నంది.. పంది.. పగిలిపోద్ది ..ఇలా ప్రాస, రైమింగ్ బాగానే ఉంది కానీ.. ఈ డైలాగ్ అయితే అర్దం అంతు చిక్కటం లేదు. సినిమాలో అక్కడున్న పరిస్దితిని బట్టి..అవతలి క్యారక్టర్ ని బట్టి అర్దవంతంగా ఉంటుందేమో చూడాలి.
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. మరో హీరోయిన్ పూర్ణ డాక్టర్ పాత్రలో కనిపించనుందని సమాచారం. శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సింహా’ , ‘లెజెండ్’ తర్వాత బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.