విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా తండ్రికి బాలకృష్ణ స్పెషల్‌ సాంగ్‌ని అంకితమిచ్చారు. 

ఎన్టీఆర్‌ జయంతి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ జన్మించిన నిమ్మకూరులో, ఇటు హైదరాబాద్‌, అటు ఏపీలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూ.ఎన్టీఆర్‌, కళ్యాణ్‌, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ నందమూరి తారక రామారావు సమాధికి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా తారక్‌ తాతని గుర్తు చేసుకోవడం అందరి హృదయాలను కదిలించింది.

మరోవైపు నిమ్మకూరులో నెలకొల్పిన ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళ్లు అర్పించారు బాలకృష్ణ. మరోవైపు హైదరాబాద్‌లో మరో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఇది ఎన్టీఆర్‌కి 99వజయంతి కావడం విశేషం. దీంతో ఈ రోజు నుంచి వచ్చే ఏడాది వరకు ఏడాది పాటు ఎన్టీఆర్‌కి శతజయంతి ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. అందులో భాగంగా నిమ్మకూరుతోపాటు పటు ప్రాంతాల్లో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను బాలయ్య ప్రారంభించారు. 

అంతేకాదు నాన్నగారు ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు సందర్భాన్ని పురస్కరించుకుని తండ్రికి ప్రత్యేకంగా ట్రిబ్యూట్‌ ఇచ్చేందుకు ఓ పాటని రూపొందించారు బాలకృష్ణ. తన ఎన్బీకే ఫిల్మ్స్ ఆధ్వర్యంలో సంగీత దర్శకుడు తమన్‌ సంగీత సారథ్యంలో `జై ఎన్టీఆర్‌` అంటూ సాగే పాటని కంపోజ్‌ చేయించారు. రామజోగయ్య శాస్త్రి పాట రాయగా, స్వరాగ్‌ కీర్తన్‌ ఆలపించారు. ఈ పాటని విడుదల చేయగా, యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది.ఎన్టీఆర్‌ నటించిన సినిమాల్లోని పాత్రలను చూపిస్తూ సాగేఈ పాట ఆద్యంతం అలరిస్తుంది.