నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై నందమూరి అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. రవికుమార్, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన జైసింహా చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అయింది. మరోసారి బాలయ్య రవికుమార్ కు అవకాశం ఇచ్చారు. 

ఆ మధ్యన విడుదలైన ఫస్ట్ లుక్ తో బాలయ్య అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చాడు. కొత్తగా కనిపిస్తున్న ఫ్రెంచ్ కట్ బియర్డ్, సరికొత్త బాడీ లాగ్వేజ్ తో బాలయ్య పూర్తిగా మారిపోయాడు. మునుపెన్నడూ చూడని బాలయ్యని రవికుమార్ ఈ చిత్రంలో ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

తాజాగా వినాయకచవితి సందర్భంగా చిత్ర యూనిట్ కొత్త పోస్టర్స్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్స్ లో బాలయ్య స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు. మరో పోస్టర్ లో బాలయ్య రొమాంటిక్ యాంగిల్ కనిపిస్తోంది. అందాలు ఆరబోస్తున్న సోనాల్ చౌహన్ తో కలసి బాలయ్య స్టెప్పులేస్తున్న పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ చిత్రంలో వేదిక మరో హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. సి కళ్యాణ్ ఈ చిత్రానికి నిర్మాత. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.