వచ్చే సంక్రాంతి బాక్సాఫీసు వద్ద బిగ్ ఫైట్ నెలకొనబోతుంది. బాలయ్య, ప్రభాస్, పవన్, రామ్‌చరణ్, బన్నీ సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు. మరి ఇందులో నిలబడేది ఎవరు? జారుకునేదెవరు ?.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
సంక్రాంతి పండగ అంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమాల పండగ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మూడు నాలుగు సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై ఆడియెన్స్ ని అలరిస్తుంటాయి. ఏమాత్రం బాగున్నా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తుంటాయి. ఈ సంక్రాంతి వచ్చిన `వాల్తేర్ వీరయ్య`, `వీరసింహారెడ్డి`లే అందుకు నిదర్శనం. సినిమా టాక్‌కి, కలెక్షన్లకి సంబంధం లేదు. భారీగా వసూళ్లు చేశాయి. నిర్మాతలకు లాభాల పంట పండించాయి. అందుకే సంక్రాంతికి తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు మొగ్గు చూపుతుంటారు మేకర్స్.
వచ్చే సంక్రాంతి(2024)కి మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, ఇండియా వైడ్‌గా బిగ్ ఫైట్ చోటు చేసుకోబోతుంది. తెలుగు హీరోల సినిమాలే భారీగా పోటీ పడుతుండటం విశేషం. ఈపోటీలో ఇప్పుడు ప్రభాస్, పవన్, బాలయ్య, బన్నీ, చరణ్ పేర్లు వినిపిస్తుండటం మరో విశేషం. ఆల్మోస్ట్ టాప్ స్టార్లంతా సంక్రాంతిని టార్గెట్ చేస్తూ తమ సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ప్రభాస్ తన సంక్రాంతి బెర్త్ ని కన్ఫమ్ చేసుకున్నారు. జనవరి 12న తాను నాగ్ అశ్విన్ తో చేస్తున్న `ప్రాజెక్ట్ కే` చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం సూపర్ హీరోల తరహాలో సైన్స్ ఫిక్షన్‌గా రూపొందుతుంది. వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది.
మరోవైపు రామ్‌చరణ్-శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న `ఆర్‌సీ15` కూడా సంక్రాంతి టార్గెట్‌గానే చిత్రీకరణ జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మించే ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. సహజంగా సంక్రాంతిని దిల్‌రాజు ఏమాత్రం వదులుకోరు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆ సమయంలో రిలీజ్ అయితే మినిమమ్ కలెక్షన్లు వస్తాయనేది ఆయన నమ్మకం. అందుకే చరణ్, శంకర్ ల చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయి ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ `ప్రాజెక్ట్ కే` వచ్చిపడటంతో దిల్‌రాజులో గుబులు పుట్టుకుందని టాక్. శంకర్ సినిమాని తక్కువ చేయడం కాదుగానీ, కలెక్షన్ల పరంగా భారీగా ఎఫెక్ట్ పడుతుందనే దిల్‌రాజు భయం. ఇక ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, శ్రీకాంత్, అంజలి,సునీల్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు శంకర్.
వీరితోపాటు బాలకృష్ణ కూడా సంక్రాంతికే రావాలనుకుంటున్నారట. ఈ సంక్రాంతికి వచ్చి `వీర సింహారెడ్డి`తో విజయం అందుకున్నారు బాలయ్య. దీంతో ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న `ఎన్బీకే108` మూవీని కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ సినిమాని ముందుగానే రిలీజ్ చేయాలని భావించినా, ప్రస్తుతం షూటింగ్ జరగడం లేదు. తారకరత్న అనారోగ్యం కారణంగా బాలయ్య బ్రేక్ తీసుకున్నారు. దీంతో షూటింగ్ ఆలస్యమవుతుంది. ఇది సినిమా రిలీజ్ డిలేకి కారణం అవుతుందని, దీంతో సంక్రాంతికి వచ్చేలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇందులో బాలయ్యకి జోడీగా కాజల్ నటిస్తుండగా, శ్రీలీలా కీలక పాత్ర పోషిస్తుంది.
వచ్చే సంక్రాంతికి ఈ మూడు సినిమాలు ప్రధానంగా పోటీ పడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏది ఏం జరిగినా ఈ మూడు సంక్రాంతికే రావాలనుకుంటున్నట్టు సమాచారం. అయితే ప్రభాస్ `ప్రాజెక్ట్ కే` ఒక్క మూవీనే రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. మిగిలిన రెండు సినిమాల డేట్లు ప్రకటించాల్సి ఉంది. వీరితోపాటు మరో ఇద్దరు పెద్ద హీరోలు కూడా సంక్రాంతికి రావాలనుకుంటున్నట్టు సమాచారం. వారిలో మెగా ఫ్యామిలీకి చెందిన పవన్, బన్నీ ఉన్నారు. బన్నీ ప్రస్తుతం `పుష్ప 2`లో నటిస్తున్నారు. సుకుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ సినిమా సంక్రాంతి పోటీ నుంచి తప్పుకునే ఛాన్స్ ఉందట. వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు కూడా సంక్రాంతికే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. `హరిహరవీరమల్లు` చిత్రాన్ని దసరాకి రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. షూటింగ్ అనుకున్నట్టు జరిగితేనే అది దసరాకి వస్తుంది. లేదంటే సంక్రాంతికి షిఫ్ట్ కావచ్చని అంటున్నారు. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో `ఉస్తాద్ భగత్ సింగ్`, సుజీత్ దర్శకత్వంలో చేయబోతున్న `ఓజీ` చిత్రాల్లో ఏదో ఒకటి సంక్రాంతికి అనుకున్నారట. కానీ రామ్‌చరణ్ మూవీ ఉంటే పవన్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. రామ్‌చరణ్ కారణంగా బన్నీ `పుష్ప2` కూడా బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి వీరిలో వచ్చే సంక్రాంతి పోటీలో ఎవరు నిలుస్తారు? ఎవరు తప్పుకుంటారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అదే సమయంలో వచ్చే సంక్రాంతికి ఫైట్ కనీవినీ ఎరుగని రీతిలో భారీ స్థాయిలో ఉండబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
