హీరో నందమూరి బాలకృష్ణ.. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. శనివారం ఆయన సీఎం క్యాంప్‌ ఆఫీసులో మర్యాద పూర్వకంగా కలిశారు. 

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యారు. ఆయన సీఎం అయి ఇరవై రోజులు దాటింది. ఈ నేపథ్యంలో ఆయనకు అభినందనల వెల్లువ సాగుతుంది. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రత్యక్షంగా మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు, ఆయన ప్రభుత్వానికి స్వయంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి కలిశారు. 

ఇక శనివారం ఉదయం నాగార్జున ఫ్యామిలీ కలిసింది. తన భార్య అమలతో కలిసి నాగార్జున.. సీఎంని కలవడం విశేషం. పుష్ప గుచ్చం ఇచ్చి కాసేపు మర్యాదపూర్వకంగా ముచ్చటించారు. వీరి మధ్య సినిమా ఇండస్ట్రీతోపాటు బిగ్ బాస్‌ వ్యవహారం, ఇతర వ్యక్తిగత విషయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలకృష్ణ కూడా సీఎంని కలిశారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని క్యాంప్‌ ఆఫీసులో కలిసి అభినందించారు. బాలకృష్ణతోపాటు ఆయన అల్లుడు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఇతర అధికారులు, నాయకులు ఉన్నారు. 

ఇదిలా ఉంటే సీఎం రేవంత్‌ రెడ్డి ఒకప్పుడు టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ ఎమ్మెల్యేగా కొన్నాళ్లపాటు సేవలందించారు. ఆ సమయంలో బాలకృష్ణతో రేవంత్‌రెడ్డికి మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు కలవడం ప్రత్యేకత సంతరించుకుంది. ప్రభుత్వం మారినప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిని, సీఎంని కలవడం కామన్‌గా జరిగేదే. అందులో భాగమే ఇదంతా అని చెప్పొచ్చు. అదే సమయంలో తమ వ్యక్తిగత పనులను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లడం, వాళ్లతో చర్చించడం జరుగుతుంటుంది. దీంతో ఇప్పుడు వీళ్లు ఎందుకు కలిశారనేది కూడా ఆసక్తికరంగా మారింది. 

కాగా బాలయ్య.. ఈ ఏడాది `వీరసింహారెడ్డి`, `భగవంత్‌ కేసరి` చిత్రాలతో విజయాలను అందుకున్నారు. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది.