ప్రారంభోత్సవం జరపకముందే బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్..

BALAKKRSIHNA ntr biopic to start shooting from tomorrow
Highlights

  • బాలయ్య హీరోగా  ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కుతున్న బయోపిక్
  • తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ రేపట్నుంచే
  • తాజాగా ఎన్టీఆర్ జయంతి టీజర్ రిలీజ్ కోసం స్పెషల్ షూట్ కు రెడీ

 

దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా టాలీవుడ్ లో పలువురు బయోపిక్స్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో, తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ కూడా వున్న సంగతి తెలిసిందే. తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో స్వయంగా బాలకృష్ణ నటించబోతున్నారు.

 

అయితే ప్రకటించి చాన్నాళ్లే అయినా ఈ సినిమా ఇంకా ప్రారంభోత్సవం జరుపుకోలేదు. 2018లో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. కానీ ఉన్నట్టుండి బాలయ్య ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా అయితే సినిమా షూటింగ్ కొంత జరిగిన తర్వాత అందులో నుండి కొన్ని సీన్లు తీసుకుని టీజర్ రెడీ చేయడమో, లేదా టీజర్ కోసం ప్రత్యేకంగా కొన్ని సీన్లు షూట్ చేయడమో చేస్తారు. కానీ బాలయ్య చేసే ‘ఎన్టీఆర్ బయోపిక్' మొదలు కాకముందే టీజర్ కోసం ప్రత్యేకంగా షూటింగ్ చేయబోతున్నారట.

 

ఈ షూటింగ్ రేపటి(డిసెంబర్ 28) నుండే మొదలు పెడుతున్నట్లు సమాచారం. టీజర్ ద్వారా అందరి దృష్టి ఈ ప్రాజెక్టు వైపు మళ్లించే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తున్నట్లు సమాచారం. టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారు? ఉన్నట్టుండి ఇంత హడావుడిగా, షూటింగు కూడా మొదలుపెట్టకుండా టీజర్ చిత్రీకరించడానికి ఓ కారణం ఉంది. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి కావడంతో ఆ రోజు టీజర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

 

ఈ చిత్రంలో ఎన్టీఆర్ బాల్యం, సినిమా, రాజకీయ రంగాల్లో ఎదిగిన తీరు, తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవ ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ప్రతి ఒక్కరూ స్పూర్తి పొందేలా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.

 

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ తెలుగు జాతి గొప్పదనాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లారు. అందుకే ఈ సినిమాను కూడా జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో భాగంగా హిందీలోకూడా విడుదల ప్లాన్ చేశారు. ‘ఎన్టీఆర్ బయోపిక్‌లో నాన్నగారి జీవిత సారాంశం ఉంటుంది. సినిమా ఎక్కడ మొదలు పెడతారు. ఎక్కడ ముగిస్తారు. కాంట్రవర్సీలు ఉంటాయా? ఇలా చాలా అడుగుతున్నారు. ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ ముగించాలో నాకు తెలుసని, అలా అడుగుతున్న వారి అందరి నోరు ఒకే దెబ్బతో మూయించా.' అని బాలయ్య గతంలో ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు.

 

సాయిమాధవ్ బుర్రా సంభాషణలను అందిస్తున్న ఈ చిత్రాన్ని బాలయ్య, సాయి కొర్రపాటి, విష్ణు ఇంద్రగంటి నిర్మించబోతున్నారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఇతర ముఖ్య తారాగణం వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

loader