రేపే బాహుబలి 2 ట్రైలర్ విడుదల రిలీజ్ డేట్ కు దగ్గరపడుతున్న కౌంట్ డౌన్ ఎంపిక చేసిన థియేటర్స్ లో మాత్రమే ట్రైలర్ ప్రదర్శన యూ ట్యూబ్ లో ట్రైలర్ చూడాలంటే గురువారం సాయంత్రం దాకా ఆగాల్సిందే

తెలుగు తెర మీద ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి 2కు కౌంట్ డౌన్ మొదలైంది. వరుస పోస్టర్లతో సందడి చేస్తున్న బాహుబలి టీం గురువారం ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. దీంతో ఫుల్ ట్రైలర్ కోసం అభిమానులు, సినీ వర్గాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

సాధారణంగా తెలుగు సినిమాకు ఒక నిమిషం నుంచి ఒకటిన్నర నిమిషం లెంగ్త్ ఉండే ట్రైలర్ రిలీజ్ చేస్తుంటారు. కానీ బాహుబలి 2 మాత్రం అభిమానులకు మరింత వినోదాన్ని పంచనుంది. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ట్రైలర్ ను కూడా అదే స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాల తరహాలో 2 నిమిషాల 20 సెకన్లు ఉండేలా ట్రైలర్ రూపొందించారు. ఇప్పటికే ట్రైలర్ కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. బోర్డ్ సభ్యులు ఈ ట్రైలర్ కు యుఎ సర్టిఫికేట్ జారీ చేశారు.

సినిమాలోని క్యారెక్టర్స్, పోరాట సన్నివేశాలు, అద్భుతాలు అన్నింటిపై... హింట్స్ ను ట్రైలర్ లో పొందుపరిచారన్న టాక్ వినిపిస్తోంది. ముంబైలో జరిగే భారీ ఈవెంట్ లో హిందీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అలాగే గురువారం ఉదయం తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో బాహుబలి 2 ట్రైలర్ ను ప్రదర్శిస్తున్నారు.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్నింటిలా కాకుండా ఈసారి యూట్యూబ్ లో బాహుబలి 2 ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు మాత్రం గురువారం సాయంత్రం వరకు ఎదురుచూడాల్సిందే.