కమెడియన్ సునీల్, దర్శకుడు త్రివిక్రమ్ ప్రాణస్నేహితులనే సంగతి తెలిసిందే. సునీల్ హీరోగా మారకముందు త్రివిక్రమ్ సినిమాల్లో కమెడియన్ గా నటించేవాడు. త్రివిక్రమ్ ప్రతీ సినిమాలో దాదాపు సునీల్ ఉండేవాడు. హీరోగా నిలదొక్కుకోలేక, వెనుకబడ్డ సునీల్ ని మళ్లీ కమెడియన్ గా నిలబెట్టాలని తమ 'అరవింద సమేత' సినిమాలో మంచి పాత్ర ఇచ్చాడు 
త్రివిక్రమ్.

అయితే ఆ పాత్ర పెద్దగా క్లిక్ అవ్వలేదు. అది మాత్రమే కాదు.. సునీల్ కమెడియన్ గా చేసిన ఏ సినిమా కూడా ఆయనకి సరైన బ్రేక్ ఇవ్వలేకపోయింది. హీరోగా మారి మళ్లీ కమెడియన్ గా టర్న్ తీసుకునే క్రమంలో సునీల్ లో కామెడీ స్పార్క్ మిస్ అయిందనే కామెంట్స్ వినిపించాయి.

అయినప్పటికీ త్రివిక్రమ్.. బన్నీతో తీస్తోన్న తన కొత్త సినిమాలో సునీల్ కి ఓ రోల్ ఇచ్చాడు. ఈ సినిమాతో అయినా.. సునీల్ కెరీర్ ముందుకు సాగుతుందని భావించారు కానీ ఇప్పుడు ఆ విషయంలో కూడా నిరాశే ఎదురవుతుందని సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాలో సునీల్ కోసం ఓ రోల్ రాసుకున్నాడు త్రివిక్రమ్.

ఆ పాత్ర రావు రమేష్ తో కలిసి ఉంటుందట. కానీ రావు రమేష్ కి డేట్స్ క్లాష్ వచ్చి సినిమా నుండి తప్పుకున్నారు. ఆయన తప్పుకోవడంతో ఆ స్థానంలోకి హర్షవర్ధన్ ని తీసుకున్నారు. ఈ క్రమంలో మొత్తం పాత్రను రీరైట్ చేసుకొని మార్చేశారని తెలుస్తోంది. దాంతో సునీల్ పాత్రని కూడా తీసేసారట. దీంతో మరోసారి సునీల్ కి నిరాశే ఎదురైంది.