యంగ్ హీరో నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం' సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తుంది. ఎట్టకేలకు మే 1న సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఇప్పుడు మరోసారి సినిమా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

దానికి కారణం 'అవెంజర్స్: ఎండ్ గేమ్' అని తెలుస్తోంది. హాలీవుడ్ కు చెందిన ఈ సినిమా కోసం ఇండియన్ ఆడియన్స్ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నారు. రేపే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా దాటిని తట్టుకోలేక 'అర్జున్ సురవరం' సినిమాను వాయిదా వేస్తున్నట్లు హీరో నిఖిల్ వెల్లడించాడు.

ఈ సందర్భంగా తన అభిమానులకు సారీ చెబుతూ పోస్ట్ షేర్ చేశాడు.  ''ఒక సంవత్సరం గ్యాప్.. మంచి సినిమాతో ఒక మంచి పాయింట్‌తో నాతో పాటు చాలా మంది టెక్నీషియన్స్ చాలా కష్టపడి కార్మిక దినోత్సవం రోజు మీ అందరి అభిమానం కోసం రావడానికి ఎదురుచూస్తున్న టైమ్‌లో అవేంజెర్స్ లాంటి ఎదురుదెబ్బ.. ఎలా ఐతే అవెంజర్స్ ధానోస్‌ని ఎదిరించి ప్రపంచం కోసం పోరాడుతారో.. అర్జున్ సురవరం కూడా స్టూడెంట్స్ కోసం పోరాడతాడు. ఇలాంటి ఒక పాయింట్ ఉన్న సినిమాని చూసి నచ్చి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ సలహా మేరకు వాయిదా వేస్తున్నాం'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇది తనకు ఎంతో బాధాకరమైన విషయం అయినప్పటికీ సినిమాను డబ్బులు పెట్టి కొన్న డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయానికి గౌరవమిస్తూ మరో గ్రాండ్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.