'అవెంజర్స్: ఎండ్ గేమ్' సినిమా గురించి అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పనక్కర్లేదు. రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా టికెట్ల కోసం థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. దేశంలో మొత్తం 2,500 థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది.

ఒక హాలీవుడ్ సినిమా ఈ రేంజ్ లో ఇండియాలో విడుదల కావడం ఇదే తొలిసారి. ఇలాంటి సినిమాకు తమిళరాకర్స్ షాక్ ఇచ్చింది. సినిమా విడుదలకు రెండు రోజుల ముందే మొత్తం సినిమాను ఆన్ లైన్ లో లీక్ చేశారు. దీంతో నిర్మాతలు ఆందోళనకు గురవుతున్నారు. 

విపరీతమైన క్రేజ్ ఉన్న ఇలాంటి సినిమాలు  ఆన్ లైన్ లో లీక్ అయితే ఆ ప్రభావం బాక్సాఫీస్ పై పడుతుందని భయపడుతున్నారు. అయితే విశ్లేషకులు మాత్రం ఈ విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదంటున్నారు.

మార్వెల్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులెవరూ కూడా పైరసీలో సినిమాను చూడరని.. థియేటర్ కి వెళ్లే ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. ఇక అడ్వాన్స్ బుకింగ్ విషయానికొస్తే.. ఒక్కరోజులో బుక్‌మైషో ద్వారా పది లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. తొలిరోజు ఈ సినిమా నలభై కోట్ల వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.