నటుడుగా అవసరాల శ్రీనివాస్ కు ఎంత మంది అభిమానులు ఉన్నారో ..అంతకు మించే దర్శకుడుగా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆయనకు డైరక్టర్ గా గ్యాప్ వచ్చింది. నాని తో అనుకున్న ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. ఈ నేపధ్యంలో ఆయన తొలి చిత్రం హీరో నాగశౌర్యతో మరోసారి సినిమా చేస్తున్నారు.

‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ రెండు చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరే తెచ్చుకున్నారు అవసరాల శ్రీనివాస్‌. ఆ రెండు చిత్రాల్లోనూ  హీరోగా నటించారు నాగశౌర్య. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ముచ్చటగా మూడో చిత్రం వస్తోంది. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టి.జి. విశ్వ ప్రసాద్‌, దాసరి పద్మజ నిర్మాతలు. హీరోయిన్ గా మాళవిక నాయర్‌ని ఎంచుకున్నారు. 

నిర్మాతలు మాట్లాడుతూ ‘‘అవసరాల శ్రీనివాస్‌ శైలిలోనే సంపూర్ణ వినోదాత్మక చిత్రంగా తీర్చుదిద్దుతున్నాం. ‘కల్యాణ వైభోగమే’తో ఆకట్టుకున్న నాగశౌర్య, మాళవికల జంట.. ఈ చిత్రంలోనూ కనువిందు చేయనుంది. ఈనెల మూడోవారం నుంచి చిత్రీకరణ మొదలెడతాము’’అన్నారు.

ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి కాగా, మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.