ఒక సీరియల్ నటి గొలుసు కారణంగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. హ్యాపీగా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొంతమంది సీరియల్ నటిపై దాడి చేయడం బంజారాహిల్స్ పరిధిలో చోటు చేసుకుంది. 

అసలు వివరాల్లోకి వెళితే.. జ్యోతి అనే సీరియల్ లో నటిస్తోన్న రాగమాధురి (37) ఇటీవల షూటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చింది. అయితే ఆమె మేడలో ఉన్న బంగారు గొలుసు పోయినట్లు గుర్తించి వెంటనే షూటింగ్ స్పాట్ లో పలువురిని ఆరా తీసింది. ఎంతకీ గొలుసు లభించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 

మేకప్ టీమ్ లో జ్యోతిక అలాగే మరో ఇద్దరిపై అనుమానం ఉన్నట్లు ఆమె పోలీసులకు తెలిపింది. పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో గొలుసు ఆమె ప్రయాణిస్తున్న కారులోనే దొరికినట్లు షూటింగ్ లో పని చేస్తున్న కొందరు రాగమాధురికి తెలిపారు.

అయితే సమస్య ముగిసింది అనుకునే లోపే జ్యోతిక కోపంతో తనపై అనుమానం వ్యక్తం చేసినందుకు రాగమాధురిపై దాడి చేయించింది. 8 మంది మూకుమ్మడిగా దాడి చేయడంతో రాగమాధురి కేసు నమోదు చేసింది. దాడికి పాల్పడ్డ వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని జ్యోతిక పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.