సినిమాల ప్రమోషన్స్ కోసం మన తారలు రకరకాల స్ట్రాటజీలు ఫాలో అవుతుంటారు. అయితే ఒక్కోసారి వాటి కారణంగా ఇబ్బందులు పడుతుంటారు. తాజాగా మలయాళ నటి ఆశా శరత్ కి అలాంటి అనుభవమే ఎదురైంది.

ఆమె ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం 'ఎవిడే'. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఆశా తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో  తన భర్త కనిపించడం లేదని, ఆయన్ని ఎక్కడైనా చూసుంటే కేరళలోని కట్టప్పన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కోరింది.

ఆమె బాధ పడుతున్నట్లుగా చాలా రియలిస్టిక్ గా వీడియో ఉండడంతో ఓ న్యాయవాది ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. విషయం పెద్దది కావడంతో ఇది సినిమా కోసం చేసిన ప్రచారం వీడియో అంటూ ఈ సీనియర్ నటి అసలు విషయాన్ని బయటపెట్టింది.

దీంతో ఆమె తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో కూడా కొందరు తారలు ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు. అప్పట్లో నటి శోభన కూడా తన సినిమా ప్రచారం కోసం వినూత్న మార్గం ఎంచుకొని విమర్శలపాలైంది.