అలనాటి నటి, మాజీ తమిళనాడు సీఎం జయలలిత జీవితం ఆధారంగా `తలైవి` చిత్రం రూపొందుతుంది. జయలలితగా కంగనా రనౌత్‌ నటిస్తున్నారు. ఇందులో కీలక పాత్ర పురుచ్చి తలైవర్‌, మాజీ తమిళనాడు సీఎం, అగ్ర నటుడు ఎంజీఆర్‌ పాత్రలో `రోజా` ఫేమ్‌ అరవింద్‌ స్వామి నటిస్తున్నారు. ఎంజీఆర్‌ 33వ వర్థంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎంజీఆర్‌ పాత్రలో నటిస్తున్న అరవింద్‌స్వామి లుక్‌ని విడుదల చేశారు. 

రాజకీయ నాయకుడుగా కార్యకర్తలకు దెండం పెడుతున్న ఫోటో, స్కూల్‌లో పిల్లలతో కలిసి భోజనం చేస్తున్న బ్లాక్‌ అండ్‌ వైట్‌లోని ఈ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో ఆయా ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ సందర్భంగా అరవింద్‌ స్వామి `పురుచ్చి తలైవర్‌ ఎంజీఆర్‌ పాత్రని పోషించడం కేవలం గౌరవం మాత్రమే కాదు, గొప్ప బాధ్యత. దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌, నిర్మాతలకు ధన్యవాదాలు. నా మీద నమ్మకం ఉంచినందుకు, నేను ఈ చిత్రాలను తలైవర్‌ జ్ఞాపకార్థం వినయంగా పోస్ట్ చేస్తున్నా` అని పేర్కొన్నారు. 

ఇందులో కరుణానిధిగా ప్రకాష్‌ రాజ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌పూర్తయ్యింది. ఈ విషయాన్ని కంగనా సోషల్‌ మీడియా ద్వారా పంచుకుని భావోద్వేగానికి గురయ్యింది. తలైవి పాత్రలో నటించడం గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొంది.