కోలీవుడ్ నటుడు విశాల్ పై సీనియర్ నటుడు అరుణ్ పాండియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. శక్తి శివన్ హీరోగా, దర్శకుడిగా రూపొందిస్తోన్న చిత్రం 'దౌలత్'.

ఎంబీ మహ్మద్ అలీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా నిర్మాత, నటుడు అరుణ్ పాండియన్ హాజరయ్యారు.

పెద్ద హీరోలు నటించిన చిత్రాలపై మాత్రమే ప్రేక్షకుల దృష్టి పడే పరిస్థితి ఏర్పడుతోందని, మంచి కథ.. నాణ్యతతో వస్తోన్న చిన్న సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందకుండా థియేటర్ల నుండి వెళ్లిపోతున్నాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినిమా గురించి మాట్లాడిన అనంతరం నటుడు విశాల్ పై మండిపడ్డారు అరుణ్ పాండియన్.

''విశాల్ నిజస్వరూపం ఇప్పుడే అర్ధమైంది. ఎందుకంటే ఆయన నటించిన 'అయోగ్య' సినిమా నిర్మాత నా మిత్రుడు. అతనికి ఎన్ని సమస్యలు ఎదురయ్యాయో నాకు తెలుసు. ముందు మనం నిజాయితీగా ఉండాలి. ఆ తర్వాతే పదవులలోకి రావాలి. నిర్మాతను దక్కించుకోవడం ముఖ్యం కాదు.. నిర్మాతను కాపాడుకోవడమే ముఖ్యం'' అంటూ చెప్పుకొచ్చారు.