డ్రగ్స్ కేసులో ముగిసిన ఆర్ట్ డైరెక్టర్ చిన్నా విచారణ కేవలం నాలుగు గంటలల్లోనే ముగిసిన విచారణ 4 గంటల్లో కీలక సమాచారం అందించటంతో త్వరగా ముగిసిన విచారణ 

డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి ఎక్సైజ్ సిట్ విచారణ గత వారం రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటికే పూరీ జగన్, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్ లను విచారించిన సిట్ మంగళవారం ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను విచారించింది.

అయితే వీళ్ల నుంచి కీలక సమాచారం సేకరించిన సిట్ మరికొందరి ప్రమేయం ఉన్న విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ రోజు ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా అలియాస్‌ ధర్మారావును విచారించిన సిట్ గతంతో పోలిస్తే చాలా తక్కువ సమయంలో విచారణ ముగించింది. ఉ. 10.30 కు ఎక్సైజ్ కార్యాల‌యంలో చిన్నా విచార‌ణ ప్రారంభమైంది. నిన్న న‌టుడు న‌వ‌దీప్ ను రాత్రి 9.45 వ‌ర‌కు విచారించిన సిట్ అధికారులు... చిన్నాను కేవలం నాలుగు గంటల పాటు విచారించి వదిలేశారు. అయితే ఈ కొద్ది సమయంలోనే తనకు తెలిసిన పూర్తి కీలక సమాచారం అందించడంతో చిన్నా విచారణ త్వరగా పూర్తయినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు హాజరైన సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక సమాచారం ఇచ్చిన నేపథ్యంలో చిన్నా విచారణ కూడా సుదీర్ఘంగా సాగుతుందని అంతా భావించినా చాలా కొద్ది సమయంలో విచారణ ముగియటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు సిట్ విచారణకు హాజరైనంత మాత్రాన అందరూ నిందితులే అని భావించడం సమంజసం కాదని పలువురు సినీ ప్రముఖులు అంటున్నారు. సిట్ విచారణకు సినిమా వాళ్లు నిందితులుగా హాజరు కావడం లేదని, కేవలం విచారణకు సహకరించేందుకు మాత్రమే వెళ్తున్నారని అంటున్నారు.

ఇక రవితేజ విచారణపై ప్రస్థుతానికి సందిగ్దత నెలకొన్నా... సిట్ కార్యాలయానికి రవితేజ హాజరవుతారని సిట్ అధికారులు భావిస్తున్నారు. రేపు మాత్రం హైకోర్టులోనూ ఊరట లభించకపోవడంతో చార్మి సిట్ విచారణకు హాజరు కావాల్సి వుంది. అయితే.. చార్మి సిట్ కార్యాలయానికి వస్తుందా లేక మరేదైనా రహస్య ప్రాంతంలో విచారణ జరుగుతుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.