యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం. ఈ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి చిత్ర యూనిట్ కు ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉన్నాయి. మొదట ఈ చిత్రానికి ముద్ర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆ టైటిల్ తో పోస్టర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. కానీ ఊహించని వివాదం కారణంగా టైటిల్ ని అర్జున్ సురవరంగా మార్చారు. 

విడుదలకు కూడా వరుసగా ఆటంకాలు ఎదురవుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని నవంబర్ 29 ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ అతిథులుగా హాజరయ్యారు. 

ప్రీరిలీజ్ వేడుకలో నిఖిల్ మాట్లాడుతూ చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించాడు. మెగాస్టార్ చిరంజీవికి తాను అభిమానికి మాత్రమే కాదు, భక్తుడిని కూడా అని తెలిపాడు. ఈ చిత్రానికి వరుసగా ఆటంకాలు ఎదురవుతున్న సమయంలో చిరంజీవి తమకు సపోర్ట్ చేస్తూ దేవుడిలా వచ్చారని నిఖిల్ తెలిపాడు. 

అర్జున్ సురవరం ప్రీమియర్ షోని ఆల్రెడీ చిరంజీవి చూసి తనని అభినందించారని.. ఆ క్షణాలని తన జీవితంలో మరచిపోలేనని నిఖిల్ అన్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత తనంతట తానుగా ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చానని చిరు అన్నారు. 

నిర్మాతలు ఠాగూర్ మధు, రాజ్ కుమార్ లపై ప్రశంసలు కురిపించారు. ఠాగూర్ చిత్రంతో నిర్మాతగా మారిన ఠాగూర్ మధు ఈ రోజు టాలీవుడ్ లో మంచి పొజిషన్ లో ఉండడం తనకు సంతోషాన్నిచ్చే విషయం అని చిరు అన్నారు. 

నిఖిల్ చిత్రాలు కొన్ని చూశా. కానీ అతడిని ఎప్పుడూ కలుసుకోలేదు. మీ అందరి లాగే నిఖిల్ కూడా నాకు ఓ తమ్ముడు. అర్జున్ సురవరం చిత్రం చాలా బావుంది. ప్రతి యువతకు కనెక్ట్ అయ్యే మూవీ ఇది. నిఖిల్ నిజాయతీ కలిగిన జర్నలిస్ట్ గా అద్భుతంగా నటించాడు. 

ఈ చిత్రంలో విప్లవ వీరుడు చే గువేరాకు సంబంధించిన అంశాలు ఉన్నాయి.చే గువేరా పేరు చెప్పగానే నాకు నా తమ్ముడు పవన్ గుర్తొస్తున్నాడు. చిరు ఈ మాట చెప్పగానే అక్కడున్న అభిమానులు పెద్దఎత్తున ఈలలు, కేకలు వేశారు. చిత్ర దర్శకుడు టి సంతోష్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిని కూడా మెగాస్టార్ అభినందించారు.