విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన నటి షాలిని పాండేకి సినిమా హిట్ అయినప్పటికీ సరైన అవకాశాలు రాలేదు. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ కాలం గడుపుతుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న '118' సినిమాలో ఒక హీరోయిన్ గా షాలిని నటిస్తోంది.

తాజాగా ఈ బ్యూటీకి బాలీవుడ్ లో మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు పరేష్ రావల్ కుమారుడు ఆదిత్యని హీరోగా పరిచయం చేస్తూ 'భాంఫాడ్' అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా షాలిని పాండేని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

అనురాగ్ కశ్యప్ ఈ సినిమాను నిర్మిస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాతో రంజన్ చందేల్ అనే నూతన దర్శకుడు పరిచయం కానున్నాడు.  గతేడాదిలోనే సినిమా షూటింగ్ మొదలైనప్పటికీ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకి రానివ్వలేదు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాతో షాలినికి బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు వస్తుందని చెబుతున్నారు. సినిమా సక్సెస్ అయితే గనుక ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో సెటిల్ అయిపోవడం ఖాయం.