దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న 'RRR' (వర్కింగ్ టైటిల్) సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు తప్ప ఇతర నటీనటుల గురించి ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. హీరోయిన్లను సైతం ఇంకా ఫైనల్ చేయలేదు రాజమౌళి. 

తాజాగా ఓ కమెడియన్ తనకు రాజమౌళి 'RRR'లో ఛాన్స్ వచ్చిందని చెబుతున్నాడు. 'అర్జున్ రెడ్డి' సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితుడి పాత్రలో కనిపించిన రాహుల్ రామకృష్ణ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 

ఆ తరువాత 'భరత్ అనే నేను', 'గీత గోవిందం' ఇలా హిట్ సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం అతడు నటించిన 'హుషారు' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీహర్ష కొనుగంటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రాహుల్ సినిమా విశేషాలతో పాటు తన తదుపరి ప్రాజెక్ట్ ల గురించి కూడా చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలో అతడికి 'RRR'లో ఛాన్స్ వచ్చినట్లుగా చెప్పాడు. ''రాజమౌళి 'RRR'లో నటిస్తున్నా.. అంతకు మించి క్యారెక్టర్ గురించి ఏమీ అడగొద్దు. నేనేం చెప్పలేను'' అంటూ వెల్లడించాడు. రాజశేఖర్ 'కల్కి', సందీప్ కిషన్ 'నిను వీడని నీడను నేనే' ఇలా అతడు నటిస్తోన్న సినిమాల గురించి చెప్పుకొచ్చాడు.