బాలీవుడ్ సీనియర్ నటి మలైకా అరోరా, యువనటుడు అర్జున్ కపూర్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జూన్ లో ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది.

ఈ విషయంపై స్పందించిన మలైకా ఇప్పట్లో పెళ్లి చేసుకునే అవకాశం లేదని చెప్పింది. తాజాగా అర్జున్ కపూర్ కూడా తన పెళ్లికి సంబంధించిన వార్తలపై స్పందించాడు. తన వయసు 33 సంవత్సరాలని, ప్రస్తుతం తను పెళ్లికి రెడీగా లేనట్లు చెప్పాడు. పెళ్లి గురించి మాట్లాడడం కూడా తనకు ఇష్టం లేదని అన్నాడు.

వివాహం జరిగితే మీకు తెలుస్తుంది కదా అంటూ మీడియాకి కౌంటర్ ఇచ్చాడు. మలైకా తన లైఫ్ లో స్పెషల్ పెర్సన్ అని చెప్పాడు. ఈ కాలంలో ఏది ఎక్కువ రోజులు దాచలేమని, తప్పుడు వార్తలు సృష్టించం మంచిది కాదని.. ప్రతీసారి వీటిపై స్పందించడం తనకు నచ్చదని చెప్పాడు.  

ఈ మధ్యకాలంలో రూమర్లు బాగా ఎక్కువైపోయాయని.. ఇదివరకు వాటిపై ఆసక్తి చూపేవారే ఇప్పుడు విసుగెత్తి ఊరుకుంటున్నారని.. తనకు ఏ విషయం దాచాల్సిన అవసరం లేదని అన్నాడు. మనకు నచ్చినవారు మన చుట్టూ ఉంటే అంతకంటే కావల్సిదేముంటుందని అన్నారు. ప్రస్తుతం అర్జున్ బాలీవుడ్ లో 'పానిపట్', 'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్' చిత్రాలతో బిజీగా ఉన్నాడు.