ఏ.ఆర్.రెహమాన్ జీవితాన్ని మార్చేసిన తాగుబోతు ఎవరో తెలుసా..?
దాదాపు 30 ఏళ్లు సంగీత ప్రపంచాన్ని ఏలిన రారాజు ఏఆర్ రెహమాన్. ఆస్కార్ సాధించి భారత గౌరవాన్ని నిలబెట్టిన రెహమాన్ జీవితాన్ని మార్చేసింది ఓ తాగుబోతు అని మీకు తెలుసా..?
సంగీత ప్రపంచానికి ఓ వరం లాంటి ఏ.ఆర్.రెహమాన్. ఇళయరాజా హవా నడుస్తున్న సమయంలో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నారు. ఎన్నో సినిమాలకు సంగీతం అందించినా.. 'రోజా' సినిమా పాటలు మనసుని హత్తుకుంటాయి. ఈ సినిమాకిగాను ఏ.ఆర్.రెహమాన్‌కి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు లభించింది.
30 ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచంలో విజయవంతంగా ప్రయాణిస్తున్న ఏ.ఆర్.రెహమాన్ సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. భారతీయ సినీ ప్రముఖుల కల అయిన ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్నారు. ఆస్కార్ వేదికపై భారత పతాకాన్ని ఎగురవేసిన వ్యక్తి రెహమాన్.
'స్లమ్‌డాగ్ మిలియనీర్' అనే హాలీవుడ్ సినిమాకి సంగీతం అందించినందుకు ఏ.ఆర్.రెహమాన్‌కి ఆస్కార్ అవార్డు లభించింది. ఈ సినిమాకి గాను 2008లో గోల్డెన్ గ్లోబ్, బాఫ్టా అవార్డులు కూడా దక్కించుకున్నారు. ఈ రెండు అవార్డులు అందుకున్న తొలి భారతీయుడిగా కూడా ఆయన చరిత్ర సృష్టించారు. 2010లో పద్మ భూషణ్ అవార్డు కూడా అందుకున్నారు.
11 ఏళ్ల వయసులోనే ఇళయరాజా బృందంలో కీబోర్డ్ ప్లేయర్‌గా చేరారు ఏ.ఆర్.రెహమాన్. తర్వాత రాజ్ కోటి, ఎం.ఎస్.విశ్వనాథన్, రమేష్ నాయుడు, జాకీర్ హుస్సేన్, కున్నక్కుడి వైద్యనాథన్ వంటి సంగీత దిగ్గజాలతో కలిసి పనిచేశారు. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుంచి క్లాసికల్ మ్యూజిక్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత బూస్ట్, ఏషియన్ పెయింట్స్, ఎయిర్‌టెల్, లియో కాఫీ వంటి 300కు పైగా ప్రకటనలకు సంగీతం అందించారు.
సినిమాలకు సంగీతం అందించడానికి ముందు చాలా బ్యాండ్స్‌లో పనిచేశారు ఏ.ఆర్.రెహమాన్. ఆ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బ్యాండ్ ప్రదర్శనల్లో ఎప్పుడూ సినిమాల్లో విడుదలైన హిట్ పాటలకే సంగీతం అందిస్తారట. అలాగే తాను కూడా చేసేవాడినని చెప్పారు. అప్పుడు మద్యం మత్తులో ఉన్న ఓ గిటారిస్ట్.. ఇప్పటికే వచ్చిన పాటలనే కాపీ కొడుతున్నావని, నీకు ప్రత్యేకమైన సంగీతాన్ని సృష్టించు.. అప్పుడే నువ్వు గుర్తింపు పొందుతావని చెప్పాడట. అప్పుడు తనకు బుద్ధి వచ్చిందని, కొత్తగా ఏదైనా చేయాలని బ్యాండ్స్‌లో పనిచేయడం మానేసి సంగీత సృష్టిపై దృష్టి పెట్టానని చెప్పారు. ఆ గిటారిస్ట్ చెప్పిన మాటే తనని సంగీత ప్రపంచంలో ఇంత ఎత్తుకి తీసుకెళ్లిందని చెప్పుకొచ్చారు.