Asianet News TeluguAsianet News Telugu

'అప్పట్లో ఒకడుండేవాడు' మూవీ రివ్యూ

  • జోనర్- డ్రామా
  • నటీనటులు : నారా రోహిత్, తాన్య హోప్, శ్రీ విష్ణు
  • దర్శకత్వం : సాగర్ కె చంద్ర
  • నిర్మాత : ప్రశాంతి, కృష్ణ విజయ్
  • సంగీతం : సాయి కార్తీక్
appatlo okadundevadu review

కథ :

వర్థమాన క్రికెటర్ గా ఎదుగుతున్న కుర్రాడు రైల్వే రాజు (శ్రీ విష్ణు). ఈ కుర్రాడు అనుకోకుండా తన సోదరి కారణంగా నక్సల్స్ కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసును ఇంతియాజ్ అలీ (నారా రోహిత్) అనే పోలీస్ ఆఫీసర్ హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ఆలీ కుర్రాడు రాజును తీవ్రంగా ఇబ్బందిపెడుతుంటాడు. అలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాజు పరిస్థితుల నుండి తప్పించుకోడానికి ఒక పెద్ద నేరానికి పాల్పడి జైలుకు వెళతాడు. తాను జైలుకు వెళ్ళడానికి కారణమైన పోలీస్ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని రైల్వేరాజు నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయంతీసుకున్న రాజు బలమైన పోలీస్ అధికారి ఇంతియాజ్ అలీని ఎలా ఎదుర్కున్నాడు అనేదే కథ.

 

సాంకేతిక విభాగం :

సినిమాలోని విజువల్స్ చాలా బాగున్నాయి. 90ల కాలంలోని వాతావరణాన్ని సహజంగా బాగా క్రియేట్ చేశారు. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో వేసిన సెట్ ఆకట్టుకుంది. సాయి కార్తీక్ సంగీతం పరవాలేదనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా కుదిరింది. సినిమా స్క్రీన్ ప్లే చాలా ఆకర్షణీయంగా క్లైమాక్స్ వరకు గ్రిప్పింగా సాగుతూ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మంచి ముగింపుగా నిలిచింది. దర్శకుడు శేఖర్ చంద్ర విషయానికొస్తే అతను మంచి కథను ఎన్నుకున్నాడు. దాన్ని రెండు పాత్రల మధ్య బాగా నడిపాడు. కమర్షియల్ హంగుల కోసం ఎక్కడ అనవసరమైన పోకడలకు పోలేదు. సెకండాఫ్ కథనం నెమ్మదించినా క్లైమాక్స్ తో సినిమాకి చాలా బలాన్నిచ్చాడు.

 

ప్లస్ పాయింట్స్ :

ప్లస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవలసింది నారా రోహిత్ పాత్ర గురించి. ఒక సపోర్టింగ్ నటుడికన్నా ఆ పాత్ర ఎక్కువగానే ఉంది. ఆ పాత్ర వలన సినిమా కథనానికి చాలా మంచి పట్టు, సీరియస్ నెస్ ఏర్పడ్డాయి. రోహిత్ పోలీస్ పాత్రలో తీవ్రమైన యాటిట్యూడ్ ప్రదర్శిస్తూ చాలా బాగా నటించాడు.

సినిమాకి కీలకమైన రైల్వే రాజు పాత్ర చాలా బాగుంది. ఆ పాత్రలో శ్రీ విష్ణు నటన కూడా అద్బుతంగా ఉంది. హీరోయిన్ తాన్య హాప్ కు ఇది మంచి డెబ్యూగా నిలుస్తుంది. ఆమె నటన ఆకట్టుకుంది. సినిమా ఫస్టాఫ్ ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంది. క్రికెట్ మ్యాచ్ నైపథ్యంలో శ్రీ విష్ణుని ఇన్వెస్టిగేషన్ చేసే సన్నివేశాలు బాగున్నాయి. శ్రీ విష్ణుని సపోర్ట్ చేస్తున్నట్టు ఉండే బ్రహ్మాజీ పాత్ర బాగుంది. సెకండాఫ్ లో రోహిత్, శ్రీ విష్ణుల మధ్య నడిచే ప్రతిఘటన సన్నివేశాలు బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

ఇది నారా రోహిత్ సినిమా అనుకున్న వాళ్లందరికీ అతను కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించడం, సినిమా అంతా శ్రీ విష్ణు మీదే నడుస్తుండటం చాలా నిరుత్సాహం కలిగిస్తుంది. సినిమా కథ బాగానే ఉన్నా సెకండాఫ్ కొన్ని చోట్ల ఎగ్జిక్యూషన్ ఫస్టాఫ్ ఉన్నంత గొప్పగా అనిపించ లేదు. రాజీవ్ కనకాల ఎంట్రీ ఇవ్వడం, రైల్వే రాజు పాత్ర నేర ప్రపంచంలోకి అడుగుపెట్టడం వంటి ఎపిసోడ్లను హడావుడిగా ముగించడంతో అందులోని ఫీల్ మిస్సయింది. సినిమా కూడా నెమ్మదించింది. సినిమాలో మధ్యలో పెద్దగా ఆశించని ఎంటర్టైన్మెంట్ వచ్చి డిసప్పాయింట్ చేసింది.

చివరగా :

మంచి కథ కథనాలు, ఎమోషన్ ఉన్న ఈ సినిమా కథకు బలమైన సపోర్ట్ ఇచ్చి, కథలో అతిధి పాత్రలాంటి ముఖ్యమైన పాత్రను చేసిన నారా రోహిత్ కు ఈ సక్సెస్ గొప్పతనం కాస్త ఎక్కువగా దక్కుతుంది. సినిమాలో శ్రీ విష్ణు తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు. రెగ్యులర్ ఎంట్రటైమెంట్ కు దూరంగా ఉండే ఈ సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అలాగే మంచి డ్రామాతో కూడిన రియలిస్టిక్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు కూడా ఈ చిత్రం మంచి చాయిస్ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios