షాకింగ్: జయ అపోలో ఆసుపత్రిలో వున్నప్పుడు సీసీటీవీలు స్విచాఫ్

షాకింగ్: జయ అపోలో ఆసుపత్రిలో వున్నప్పుడు సీసీటీవీలు స్విచాఫ్

దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మృతి మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే. జయ మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో మరో షాకింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నంత కాలం సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదట. ఆ సమయంలో సీసీటీవీ కెమెరాలు స్విచ్ఛాఫ్ చేశామని, ఆమె ఆస్పత్రిలో ఉన్న 75 రోజుల పాటు అవి పనిచేయలేదని అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ సీ రెడ్డి తెలిపారు. దీంతో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందిన తీరుకు సంబంధించి ఎలాంటి వీడియో రికార్డు లేదని తేటతెల్లమైంది. ఈ అంశం హాస్పిటల్‌లో ఏదో జరిగిందనే అనుమానాలకు బలం చేకూర్చేలా ఉండటంతో మరోసారి కలకలం రేగుతోంది.

అనారోగ్యానికి గురైన జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. 2016 డిసెంబర్ 5న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె అనారోగ్యానికి గురవడం, చికిత్స తదితర విషయాలను గోప్యంగా ఉంచడం, ఆస్పత్రిలోకి ఎవర్నీ అనుమతించకపోవడంతో అన్నాడీఎంకే నేతలతో పాటు పలువురు అనుమానం వ్యక్తం చేశారు.

జయలలిత మృతి ఒక మిస్టరీగా మారడంతో ఆమె మృతి వెనుక కారణాలపై రిటైర్డ్‌ జడ్జి అరుముగ స్వామి నేతృత్వంలో విచారణ కమిషన్‌ వేశారు. ఈ కమిటీకి డాక్యుమెంట్లన్నీ సమర్పించినట్టు ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు. ‘అపోలో ఇంటర్నేషనల్ కొలొరెక్టల్ సింపోజియ 2018’పై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలు ఈ సంచలన అంశాన్ని బయటపెట్టాయి.

‘దురదృష్టవశాత్తు ఆ 75 రోజులూ ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలన్నింటినీ స్విచ్‌ ఆఫ్‌ చేశారు. జయలలిత ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యాక.. ఐసీయూను పూర్తిగా ఆమె కోసమే కేటాయించాం. ఇతర పేషంట్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలు రికార్డు చేయకూడదని, వాటిని ఎవరూ చూడకూడదని జయలలిత కోరినట్లు ఆమె సన్నిహితులు తెలిపారు. అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎయిమ్స్ వైద్య బృందంతో కలిసి మేం ఆమెకు మెరుగైన చికిత్స అందించాం’ అని ప్రతాప్‌ సీ రెడ్డి అన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page