నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు దర్శక నిర్మాత, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ. అవి నంది అవార్డులు కాదని.. కమ్మ నందులని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే తనకొచ్చిన నందిని తిరస్కరించానని అన్నారు. 

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే దర్శక నిర్మాత, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన నంది అవార్డులను టార్గెట్ చేశారు. పరిశ్రమలో కమ్మ, కాపు డామినేషన్ లేదని.. ఇక్కడ కేవలం డబ్బు మాత్రమే డామినేషన్ చేస్తుందని ఆయన అన్నారు. టెంపర్ సినిమాలో నటనకు గాను తనకు నంది అవార్డ్ వచ్చిందని.. కానీ అది తన దృష్టిలో కమ్మ నంది అని, అందుకే తిరస్కరించానని పోసాని పేర్కొన్నారు. అవి నంది అవార్డులు కాదని.. కమ్మ నందులు అంటూ కృష్ణ మురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అవార్డులను గ్రూపులు, కులాలవారీగా పంచుకుంటున్నారని.. గతంలో ఎన్నో మంచి సినిమాలకు కథలు రాస్తే తనకు అవార్డ్ రాలేదని పోసాని తెలిపారు. నంది పురస్కారాలపై పరిశ్రమలోనూ, ప్రజల్లోనూ ఎన్నో అపోహాలు వున్నాయని కృష్ణ మురళీ అన్నారు. నంది అవార్డులను పంచుకునే విషయంలో గతంలో చాలా మంది దర్శక , నిర్మాతలు నష్టపోయారని ఆయన పేర్కొన్నారు. నంది అవార్డుల ప్రదానోత్సవంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని పోసాని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో షూటింగులు చేస్తే నిర్మాతలకు రాయితీలు ఇస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో చలన చిత్ర అభివృద్ధి కోసం సీఎం జగన్‌తో చర్చిస్తామని పోసాని చెప్పారు. 

Also Read: పోసాని కృష్ణ మురళికి సీఎం జగన్ గుడ్ న్యూస్.. కీలక పదవిని కట్టబెడుతూ ఉత్తర్వులు..

కాగా.. గతేడాది నవంబర్‌లో పోసాని కృష్ణ మురళిని ఏపీ ఫిల్మ్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు సీఎం వైఎస్ జగన్. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల మరో నటుడు అలీని ఏపీ ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారుగా నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలీ, పోసాని కృష్ణ మురళీ ఇద్దరు కూడా 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేశారు. పోసాని చాలా కాలంగా వైసీపీకి మద్దతుగా తన వాయిస్ వినిపిస్తుండగా.. అలీ 2019 ఎన్నికలకు ముందు పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి వీరి పదవుల విషయంలో ఎప్పుడూ చర్చ సాగుతూనే వస్తుంది. అయితే ఎట్టకేలకు దాదాపు మూడున్నరేళ్ల తర్వాత వీరికి సీఎం జగన్ శుభవార్త వినిపించారు.