ఎఫ్2 చిత్రంతో ఈ ఏడాది విక్టరీ వెంకటేష్ ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ వెంకీ మామ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ నటించే తదుపరి చిత్రం గురించి ఇటీవల ఆసక్తికర ప్రకటన వచ్చింది. తమిళంలో ఘనవిజయం సాధించిన ధనుష్ చిత్రం 'అసురన్' తెలుగు రీమేక్ లో వెంకటేష్ నటించబోతున్నాడు. 

ఈ చిత్రాన్ని సురేష్ బాబు నిర్మించనున్నారు. అసురన్ చిత్రంలో ధనుష్ విలక్షణ నటన ప్రదర్శించాడు. ధనుష్ కి జోడిగా మంజు వారియర్ నటించింది. ధనుష్ కన్నా మంజు వారియర్ వయసులో 4 ఏళ్ళు పెద్ద. అయినా కూడా ఆ పాత్రలో ఆమె బాగా ఒదిగిపోయింది. 

ఇదిలా ఉండగా వెంకటేష్ నటించే అసురన్ తెలుగు రీమేక్ కు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. దర్శకుడిగా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల ఎంపికయ్యారు. ప్రస్తుతం నటీ నటుల కోసం అన్వేషణ జరుగుతుంది. వెంకటేష్ కు నటించే హీరోయిన్ విషయంలోఅనుష్క పేరు వినిపిస్తోంది. చిత్ర యూనిట్ అనుష్కతో సంప్రదింపులు జరుపుతున్నారట. 

ముందుగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్ కోసం కాజల్, శ్రీయ శరన్ లాంటి హీరోయిన్లని పరిశీలించారు. కానీ ప్రస్తుతం అనుష్క వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అనుష్క ప్రస్తుతం నిశ్శబ్దం చిత్రంలో నటిస్తోంది. అసురన్ రిమేక్ లో నటించేది ఖాయమైతే వెంకటేష్ సరసన అనుష్క మూడవసారి నటించబోతున్నట్లు అవుతుంది. గతంలో వీరిద్దరూ చింతకాయల రవి, నాగవల్లి చిత్రాల్లో నటించారు. 

తమిళంలో భూవివాదాలు నేపథ్యంలో తెరకెక్కించిన అసురన్ చిత్రం అద్భుతమైన వసూళ్లు సాధించింది. వెట్రి మారన్ దర్శత్వంలో నటించిన ఈ చిత్రంలో ధనుష్ చెలరేగి నటించాడు. తెలుగు రీమేక్ కోసం వెంకటేష్ తన మేకోవర్ మార్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.