సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి బాహుబలి2, భాగమతి చిత్రాల తర్వాత మరో చిత్రంలో నటించలేదు. ఇటీవలే అనుష్క హేమంత్ మధుకర్ దర్శకత్వంలో, ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణంలో సైలెన్స్ అనే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. భాగమతి చిత్రం విడుదలై ఏడాది గడచిన తర్వాత అనుష్క కొత్త చిత్రానికి సంబంధించిన ప్రకటన వచ్చింది. 

ఈలోపు అనుష్క కేంద్రంగా అనేక పుకార్లు పుట్టుకుని వచ్చాయి. అనుష్క సినిమాలకు దూరం అవుతోంది.. పెళ్ళికి సిద్ధం అవుతోంది అంటూ ప్రచారం జరిగింది. ప్రభాస్, అనుష్క మధ్య ప్రేమ వ్యవహారం జరుగుతున్నట్లు కూడా వార్తలు సృష్టించారు. ఈ ఊహాగానాలపై పలు సందర్భాల్లో ప్రభాస్, అనుష్క ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం స్నేహితులం మాత్రమే అని తేల్చారు. ఇదిలా ఉండగా అనుష్క త్వరలో అమెరికాకు బయలుదేరుతోంది. 

సైలెన్స్ చిత్రం ఎక్కువగా భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది. దీనితో చిత్ర యూనిట్ మొత్తం యూఎస్ వెళ్లనున్నారు. ఇది వరకే అమెరికాలో షూటింగ్ ప్రారంభించి ఉండాల్సింది. కానీ అనుష్కకు వీసా సమస్య రావడంతో ఆలస్యం జరిగింది. వీసా సమస్య తీరగానే యూఏస్ షెడ్యూల్ ని చిత్ర యూనిట్ ఖరారు చేశారు. 

భాగమతి చిత్రం తర్వాత అనుష్క బాగా బొద్దుగా మారింది. దీనితో విదేశాలకు వెళ్లి మరీ సహజసిద్ధమైన వైద్యంతో స్లిమ్ గా మారింది. మునుపటిలా అనుష్క ప్రస్తుతం నాజూగ్గా కనిపిస్తోంది. సైలెన్స్ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హీరో మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనుష్క ఇప్పటికే  లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తన సత్తా నిరూపించుకుంది. సైలెన్స్ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి .