మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. మెగాస్టార్ 151వ చిత్రం అయిన సైరాని మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మించాడు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీతో పాటు సౌత్ ఇండియన్ అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. 

ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక అందాల తార నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో అనుష్క కూడా ఓ పాత్రలో నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ ఆమె పాత్రకు సంబంధించిన ఎలాంటి లుక్ ని విడుదుల చేయలేదు. 

తాజాగా రాంచరణ్, చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో అనుష్క పాత్రని అధికారికంగా అంగీకరించడమే కాదు.. అంచనాలు పెంచేసి ఆసక్తికర విషయాన్ని కూడా పంచుకున్నారు. రాంచరణ్ మాట్లాడుతూ.. ఝాన్సీ లక్ష్మీ బాయి, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఇద్దరూ పదేళ్ల వ్యత్యాసంతో మరణించారు. మనకు తెలియదు కానీ.. సిపాయిల తిరుగుబాటుకు.. ఝాన్సీ లక్ష్మి బాయి బ్రిటిష్ వారితో పోరాడడానికి స్ఫూర్తినిచ్చింది నరసింహారెడ్డే. 

తన సైనికుల్లో ధైర్యం నింపడానికి లక్ష్మీబాయి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటాన్ని వివరించే వారు అని రాంచరణ్ తెలిపాడు. అంతలో మెగాస్టార్ చిరంజీవి అందుకుని ఈ చిత్రంలో లక్ష్మీబాయి పాత్రలో అనుష్క నటిస్తోందని వివరించాడు. అనుష్క పాత్ర ద్వారానే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర చిత్రంలో పరిచయం అవుతుందని మెగాస్టార్ పేర్కొన్నారు. 

అంటే ఈ చిత్రంలో అనుష్క పవర్ ఫుల్ డైలాగ్స్ తో మెగాస్టార్ పాత్రని పరిచయం చేస్తుంది.నరసింహారెడ్డిని బ్రిటిష్ వారితో ఎలా పోరాడారు.. ఆయన్ని బ్రిటిష్ వారు ఎలా ఉరితీశారు లాంటి అంశాలు అనుష్క వాయిస్ ఓవర్ లో ఉండబోతున్నాయి.  ఇది సినిమాపై మరింతగా అంచనాలు పెంచే విషయమే.