Asianet News TeluguAsianet News Telugu

ఒట్టు.. అసలు భాగమతిలో “భాగమతి” లేనే లేదు.. ఫుల్ రివ్యూ రేటింగ్

  • చిత్రం- భాగమతి
  • నటీనటులు- అనుష్క, ఉన్ని ముకుందన్, జయరామ్, మురళీ శర్మ,ఆశా శరత్
  • సంగీతం- థమన్
  • దర్శకత్వం-అశోక్
  • నిర్మాణం- యువీ క్రియేషన్స్
  • ఆసియానెట్ రేటింగ్- 3/5
anushka shetty bhaagmathie full review

బాహుబలి తర్వాత అనుష్క నటించిన ప్రతిష్టాత్మక చిత్రం భాగమతి. చాలా కాలంపాటు తెరకెక్కిన ఈ మూవీలో అనుష్కబాహుబలి దేవసేనలా భాగమతిగా మెప్పించిందా.. పిల్ల జమీందార్ లాంటి హిట్ సినిమా తెరకెక్కించిన  దర్శకుడు అశోక్ యువీ క్రియేషన్స్ బేనర్ లో తెరకెక్కిన భాగమతి సినిమాతో అనుష్కకు ఎలాంటి సక్సెస్ అందించాడు. భాగమతిలో భాగ”మతి” వుందా లేదా...

 

కథ-

ప్రాణ ధార ఇరిగేషన్ ప్రాజెక్టు ఎలాగైనా కావాలనే ఉద్దేశంతో అసరమైతే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసైనా సరే ప్రజలకు మేలు జరిగే వరకు తాను విశ్రమించనని, ప్రాజెక్టు సాధించలేకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని... ముఖ్యమంత్రి ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ మంజూరు చేయించేలా పోరాడుతానని ప్రకటిస్తాడు సెంట్రల్ మినిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ (జయరామ్). పబ్లిగ్గా ఈశ్వర ప్రసాద్ కున్న ఈ ఇమేజ్ ఒక కోణం. అయితే మరోకోణంలో సెంట్రల్ మినిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ మొత్తం 125 గ్రామాలతోపాటు బాక్సైట్ గనులున్న మరో 8 గ్రామాలను కూడా అందులో కలిపి ఖాళీ చేయించాలని స్కెచ్ వేస్తాడు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలంటే డబ్బు కావాలనే లక్ష్యంతో వేలకోట్లు అడ్డగోలుగా కూడబెట్టి బినామీ పేర్ల రాయిస్తుంటాడు ఈశ్వర్ ప్రసాద్. ఆ ప్రాజెక్టు అనుమతులిచ్చే ఐఏఎస్ ల కమిటీ ప్రధాన అధికారణిగా వున్న చంచల(అనుష్క) అప్పటివరకు ఈశ్వర ప్రసాద్ లోని మంచి కోణాన్ని మాత్రమే చూసి ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేస్తుంది. అయితే ఉన్నత చదువులు చదివి విదేశాల్లో లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం వదిలి ప్రజల కోసం పనిచేస్తూ ఊరిని,  ప్రజలను కాపాడుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతుంటాడు శక్తి(ఉన్ని ముకుందన్). ఓ ఆందోళనలో భాగంగా రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులనుంచి ఐఏఎస్ అధికారిణి చంచలను కాపాడతాడు శక్తి. అలా ఇద్దరి ఆశయాలు ప్రజలకు మంచి చేయటం కోసమే కావటంతో మనససులు కలుస్తాయి. అలాంటి సమయంలోనే తన ప్రాణానికి  ప్రాణమైన శక్తిని చంపి చంచల జైలుకు వెళ్తుంది.  జైలుకు వెళ్లిన చంచలను రహస్య విచారణ కోసం పోలీసు డిపార్టుమెంట్ కు చెందిన పాడుబడ్డ పాత బంగ్లాకి తీసుకెళ్తారు. అక్కడ చంచల తరచూ భాగమతిగా మారిపోతుంటుంది. ఇంతకీ ఆ బంగ్లాకి భాగమతికి వున్న సంబంధం ఏంటి.. చంచల భాగమతిగా ఎందుకు మారింది. చివరకు తన చేతనే తన ప్రాణమైన ప్రియున్ని చంపాల్సిన దుస్థితికి తీసుకొచ్చిన మినిస్టర్ ఈశ్వర ప్రసాద్ ను చంచల ఎలా అంతం చేసిందన్నది తెలుసుకోవాలంటే మాత్రం థియేటర్ కు వెళ్లాల్సిందే.

 

విశ్లేషణ-

దెయ్యం, సైన్స్ ల మధ్య ఘర్షణ క్రియేట్ చేయటం అనే ఒక సున్నితమైన అంశాన్ని పక్కా ప్లాన్ ప్రకారం స్క్రిప్ట్ లో ఎక్కడా తప్పులు దొర్లకుండా.. లింక్ చేసి సింక్ చేయటంలో దర్శకుడు అశోక్ పర్ ఫెక్ట్ అనిపించుకుని సక్సెస్ అయ్యాడు. సాధారణంగా ఇలాంటి కథలు సరైన సింకింగ్ లేక మిస్సవుతుంటాయి. కానీ హారర్ థ్రిల్లర్ మూవీలో కామెడీని కూడా ఎలా పండించొచ్చో నిరూపించాడు అశోక్. కామెడీనే అనుకుంటే భయ పెట్టడంలోనూ అంతే పర్ ఫెక్షనిస్ట్ అనిపించుకున్నాడు. సినిమా చూసి ఒక్కసారైనా దెయ్యాలంటే భయపడని వాళ్లు వుండరంటే ఎలాంటి స్క్రీన్ ప్లే, ఎలాంటి బ్యాగ్రౌండ్ స్కోర్ తో సీన్స్ తెరకెక్కించారో అర్థం చేసుకోవచ్చు. ఛాయాగ్రహణం‌తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఖర్చు పరంగా నిర్మాతలు వెనుకాడలేదు. దర్శకుడు అశోక్ టేకింగ్ ఆకట్టుకుంటుంది. అనుష్క ప్రేమించే శక్తి అన్నయ్యగా ఏసీపీ సంపత్ పాత్రలో మురళీ శర్మ తనదైన నటన ప్రదర్శించాడు. ఇక సీబీఐ ఆఫీసర్ వైష్ణవి నటరాజన్ పాత్రలో (ఆశాశరత్) అద్భుతంగా నటించింది. పోలీసులుగా లింగమూర్తి పాత్రలో ధనరాజ్, సుబ్బారెడ్డి పాత్రలో ప్రభాస్ శీను, ఎస్సైగా విద్యా రామన్ తమ నటనతో కామెడీ అద్భుతంగా నటించి కడుపుబ్బా నవ్వించారు.ఫస్ట్‌ హాఫ్‌ అంతా చాలా ఇంటెన్సిటీతో నడిపించాడు దర్శకుడు అశోక్.

అక్రమాలు చేసే రాజకీయ నేతను పట్టుకునేందుకు సీబీఐ ఆఫీసర్ వైష్ణవి నేతృతత్వంలో జరిగే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో పాడుబడ్డ కోటలోని వివిధ గదుల్లో చీకట్లో అనుష్క తిరగడం, అక్కడ తనకు ఎదురయ్యే సంఘటనలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ఫస్ట్ హాఫ్ లో అలా ఇన్వెస్టిగేషన్ సాగుతుండగా... భాగమతి ఫుల్ రోల్ ఫ్రేమ్ కావటం... ఎక్కడికి పోతార్రా.. లెక్క తేలాల్సిందే... అంటూ చెప్పే డైలాగ్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు సీన్ సెకండడాఫ్ పై మరింత ఎగ్జయిట్ మెంట్ క్రియేట్ చేసి సినిమాకు హైలైట్‌గా నిలిచింది. అనుష్క తన అధ్బుతమైన నటన, హావభావాలతో కట్టి పడేసింది.

అనుష్క చంచలగా, భాగమతిగా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలను తెరపై బాగా పండించింది. భాగమతిగా అనుష్క హావభావాలు, వేషధారణ, నడక అన్నీ పర్ఫెక్ట్‌ గా కుదిరాయి. పాడుబడ్డ కోటలోకి అనుష్క తొలిసారి వెళ్లే సన్నివేశం, ఇంటర్వల్ ఎపిసోడ్‌లో తనలో భాగమతి ఆవహించింది అన్నట్లు నటించే సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచాయి. అనుష్క చీరకట్టులో అందంగా కనిపించింది.  అనుష్క నటన, కోట సెటప్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

సెకండ్ హాఫ్ ఇంకాస్త బలంగా ఉంటే ఇంకా మంచి చిత్రం అయ్యి ఉండేది. దర్శకుడు ద్వితీయార్ధాన్ని మరింత బాగా మలిచి ఉన్నట్లయితే ‘భాగమతి’ ఓ అమూల్యమైన చిత్రంగా నిలిచిపోయేది. ఈ సినిమాపై ఉన్న అంచనాలు, ఆసక్తి వల్ల ఓపెనింగ్స్‌ కి ఎలాంటి ఢోకా ఉండదు. ఇందులో ఉన్న కామెడి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సెంటిమెంట్, అనుష్క నచన సినిమాకు మరింత సక్సెస్ అయేందుకు దోహదపడతాయనటంలో సందేహం లేదు.

చివరగా-

భాగమతి సినిమాలో అసలు భాగమతి లేదు. ఏదో అరబిక్ భాషతో జస్టిఫై చేసే చిన్న ప్రయత్నం చేశాడు తప్ప.. చంచలను ఆవహించిన భాగమతి ఆత్మలోనే ప్రేక్షకులు సంతృప్తి పడాలి తప్ప అసలు భాగమతిని మాత్రం చూపించలేదు. ఏదేమైనా మొత్తానికి “భాగమతి” భయపెట్టేస్తుందంతే.

 

Follow Us:
Download App:
  • android
  • ios