బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ తాను బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకోకపోవడానికి కారణాలు చెప్పింది. ఇలాంటి క్లిష్ట సమయంలో సెలబ్రేట్‌ చేసుకోవడం కరెక్ట్ కాదని, అంతేకాదు తాను, భర్త విరాట్‌ కొహ్లీ కలిసి త్వరలో తమ వంతు సాయం చేసేందుకు ముందుకు రాబోతున్నట్టు వెల్లడించింది. అనుష్క శర్మ పుట్టిన రోజు మే1. మేడే రోజు జన్మించిన ఈ అమ్మడు ఈ సారి తన బర్త్ డే సెలబ్రేషన్స్ కి దూరంగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే గతేడాది కూడా ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్ కి దూరంగా ఉన్నారు. 

ఇక ఈ సారి పుట్టిన రోజు జరుపుకోకపోవడంపై తాజాగా అనుష్క శర్మ స్పందించారు. తనకు బర్త్ డే విషెస్‌ చెప్పిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా ఈ మేరకు ఆమె ఓ వీడియోని అభిమానులతో పంచుకున్నారు. ఇందులో అనుష్క స్పందిస్తూ, `నిజంగా తన రోజుని చాలా ప్రత్యేకంగా చేశారు. అందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కానీ కరోనా మహమ్మారి విజృంభన సమయంలో ప్రజలంతా బాధపడుతున్నారు. ఇంతటి పెయిన్‌ మధ్య బర్త్ డే సెలబ్రేషన్‌ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇలాంటి సంక్షోభ సమయంలో భారతదేశాన్ని మొత్తం ఏకం చేసి మద్దతివ్వాలి` అని పేర్కొంది. 

ఇంకా చెబుతూ, `ఈ క్లిష్ట సమయంలో ప్రతి ఒక్కరు ఆపదలో, సహాయం కావాల్సిన వారికి హెల్ప్ చేయాలని కోరుతున్నా. అంతేకాదు నేను, విరాట్‌ కలిసి మా వంతు కృషి చేయబోతున్నాం. ఆ విషయాలు త్వరలోనే వెల్లడిస్తాం. ఈ ఉద్యమంలో మీరు కూడా భాగం కావాలని కోరుకుంటున్నా. మనందరం కలిసి కట్టుగా దీనిపై పోరాడాలి. దయజేసి అందరు సురక్షితంగా, జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు` అని తెలిపింది అనుష్క.

అనుష్క శర్మ బర్త్ డే సందర్భంగా అనేక మంది సెలబ్రిటీలు ఆమెకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో కరీనా కపూర్‌, సోనమ్‌ కపూర్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌, వివేక్‌ ఒబేరాయ్‌ వంటి వారు ప్రముఖంగా ఉన్నారు. ఇక అనుష్క శర్మ చివరగా `అంగ్రేజ్‌ మీడియం`లో ఓ స్పెషల్‌ సాంగ్‌లో మెరిశారు. అంతకు ముందు 2018లో షారూఖ్‌తో `జీరో` చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఏ సినిమాని ఒప్పుకోలేదు. ఈ జనవరిలో ఆమె పాప వామికకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.