మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి కోసం అభిమానుల ఎదురుచూపులు తప్పడం లేదు. ఏడాదికి పైగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతూనే ఉంది. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథ కావడంతో దర్శకుడు సురేందర్ రెడ్డి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో 200 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే సైరాలో అన్ని చిత్ర పరిశ్రమల నుంచి అగ్ర నటులు నటిస్తున్నారు. 

అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. గత కొన్ని రోజులుగా క్రేజీ హీరోయిన్ అనుష్క కూడా ఈ చిత్రంలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. అనుష్క పాత్ర గురించి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో అనుష్క గ్లామరస్ గా కనిపించబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

మరికొందరు మాత్రం అనుష్క సైరా నరసింహారెడ్డి కథని వివరించే పాత్రలో నటిస్తోందని అంటున్నారు. అనుష్క బాల్యంలో ఉండగా సైరా నరసింహారెడ్డి పోరాటాలు చేస్తాడు. ఆమె పెరిగి పెద్దదైన తర్వాత నరసింహారెడ్డి వీర చరిత్రని అందరికి తెలియజేస్తుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనుష్కని సైరా చిత్రంలోకి తీసుకురావడానికి మరో కారణం కూడా ఉందట. 

కథలో భాగంగా నరసింహారెడ్డిని బ్రిటీష్ వారు ఉరితీస్తారు. హీరోని ఉరితీసే సన్నివేశాలు మెగా అభిమానులకు అంతగా రుంచించకపోవచ్చు. అందుకే ఆ  సీన్ చూపించకుండా నరసింహారెడ్డి మరణించినట్లు అనుష్క పాత్ర ద్వారా తెలియజేస్తారట. అనుష్క సైరా నరసింహారెడ్డి గురించి చెప్పే సమయంలో ఆమె మాటలు ఉద్వేగభరితంగా ఉంటాయని అంటున్నారు. సైరా చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.