'చంద్రముఖి' సీక్వెల్ లో అనుష్క,త్వరలో ప్రకటన
విక్రమార్కుడు, అస్త్రం, లక్ష్యం, డాన్, ఒక్క మగాడు, స్వాగతం, బలాదూర్, శౌర్యం, చింతకాయల రవి, కింగ్ సినిమాల్లో నటించింది. అనంతరం వచ్చిన ‘అరుంధతి’ సినిమా అనుష్క కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాతో అనుష్క గ్రాఫ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది.
‘సూపర్’ చిత్రంతో.. సినీ సిండస్ట్రీలోకి అడుగు పెట్టిన స్వీటీ అనుష్క ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. తన గ్లామర్ షోతో ఎన్నో సినిమాల్లో చేస్తూ దూసుకుపోయింది. ఇక ‘అరుంధతి’ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ భాషల్లోని దాదాపు అందరి స్టార్ హీరోలతో నటించి మెప్పింది. చివరగా ‘నిశ్శబ్దం’ సినిమాతో పలకరించిన ఆమె.. దాని తర్వాత ఇప్పటిదాకా ఏ సినిమా కమిటవ్వలేదు. ఆ మధ్యలో యువి క్రియేషన్ బ్యానర్ కోసం నవీన్ పొలిశెట్టితో కలిసి ఒక విభిన్నమైన సినిమా చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి కానీ అధికారిక ప్రకటన రాలేదు. ఆగిపోయినట్లే వినపడుతోంది. అందుకు రకరకాల కారణాలు వినపడుతున్నాయి. అలాగే ఆమె తమిళంలోనూ ‘సింగం-2’తర్వాత ఏ సినిమా కమిటవ్వలేదు. కానీ తాజాగా ఆమె 'చంద్రముఖి' సీక్వెల్ ఓకే చేసిందని వినికిడి.
తమిళ మీడియాలో ప్రచారం అవుతున్న కథనాలు ప్రకారం ..నాలుగేళ్లకు పైగా గ్యాప్ తర్వాత అనుష్క తమిళంలో ఓ సినిమా కమిటైందని.. అది చాలా స్పెషల్ మూవీ అని ప్రచారం జరుగుతోంది. సౌత్ లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచిన ‘చంద్రముఖి’కి ఇప్పుడు తమిళంలో సీక్వెల్ రెడీ అవుతోంది. అయితే రజినీకాంత్ నటించట్లేదు. ఆ ప్లేస్ లో రాఘవ లారెన్స్ కనపడనున్నారు. ‘చంద్రముఖి’ దర్శకుడు పి.వాసునే ఈ చిత్రాన్ని కూడా రూపొందించనున్నాడు. ఆయన ఇప్పటికే కన్నడలో, తెలుగులో ‘చంద్రముఖి’ సీక్వెల్స్ తీశాడు. ఐతే కన్నడలో సక్సెస్ అయిన ఆ సినిమా.. తెలుగులో మాత్రం వెంకటేష్ తో చేయగా డిజాస్టర్ అయింది.
అయితే ఇప్పుడు ఆ కథను పక్కన పెట్టి.. తమిళంలో వేరే స్టోరీ లైన్ ను ఎంచుకుని ‘చంద్రముఖి-2’ తీయబోతున్నాడు. త్వరలోనే షూటింగ్ మొదలు కానుందట. ఈ చిత్తరంలో చంద్రముఖి పాత్రను అనుష్క చేయబోతోందని.. సినిమాలో ఆమెదే కీలకమైన పాత్ర అని అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట.