సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు డైరెక్టర్లుగా మారడం అరుదుగా జరుగుతుంటుంది. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో దర్శకులుగా మారిన కథానాయికల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటి జెనరేషన్ హీరోయిన్లలో  దర్శకత్వం మీద ఆసక్తి చూపేవారు కూడా బాగా తక్కువ.

అప్పుడప్పుడు నిత్యామీనన్ డైరెక్టర్ అవ్వాలనుందని కామెంట్స్ చేస్తుంటుంది. ఇప్పుడు మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా డైరెక్టర్ అవుతానంటోంది. 'అ ఆ','ప్రేమమ్','ఉన్నది ఒకటే జిందగీ' వంటి సినిమాలలో నటించిన అనుపమ ఇటీవల 'హలో గురు ప్రేమకోసమే' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కెమెరా ముందు నటించడం కంటే వెనుక ఉండడమే తనకు ఇష్టమని చెబుతోంది ఈ నటి.

''దర్శకురాలు కావాలనేది నా కల. మణిరత్నం గారు ఫ్రేమ్ ఎక్కడపెట్టినా చాలా అందంగా ఉంటుంది. ఆయనలా అందమైన విజువల్స్ తీయాలనేది నా కల. నా దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటిని కథలుగా మార్చాలి. త్రివిక్రమ్ తో పాటు నేను పని చేసిన కొందరు దర్శకులను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్చుకోవచ్చు కదా అని అడిగాను.

త్రివిక్రమ్ గారు ఛాన్స్ ఇస్తానని చెప్పారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి ఆ తరువాత డైరెక్టర్ అవుతా.. ఎప్పుడు దర్శకురాలు అవుతానో చెప్పలేను. కానీ కచ్చితంగా అవుతాను'' అంటూ చెప్పుకొచ్చింది.