---సూర్య ప్రకాష్ జోశ్యుల

మనలో చాలా మందికి గ్రహాలు గురించి నాలెడ్జ్ ఉంటుంది. అయితే అది కేవలం మన గ్రహబలాలు గురించి తెలుసుకునేదాకానే. అలాగే శాటిలైట్ అంటే చాలా మందికి టీవీ ఛానెల్స్ కు, సెల్ ఫోన్స్ కు సిగ్నల్స్ సప్లై చేసే ఓ పెద్ద మిషన్ అని భావిస్తూంటాం. అంతేతప్ప అంతరిక్ష విజ్ఞానం అనేది ఓ సైన్స్ అని, దాన్ని చాలా మంది అధ్యయనం చేస్తారని తెలియదు. అబ్దుల్  కలాం లేకపోతే శ్రీహరి కోట పేరు కూడా విని ఉండని పరిస్దితి.

అలాంటి అంతంత మాత్రం జ్ఞానంతో మసిలే మనకు ‘అంత‌రిక్షం’లో జరిగే ఓ సైన్స్ ఫిక్షన్ కథ చెప్పటం ప్రారంభించాడు సంకల్ప్. అయితే చెప్పేవాడు సరైనవాడైతే ఏ కథైనా రక్తి కడుతుంది. బుర్రకు ఎక్కుతుంది. ఆ విషయంలో సంకల్ప్ సమర్దుడే అని ఆల్రెడీ ఘాజీతో ప్రూవ్ అయ్యింది.  అందుకే ‘అంత‌రిక్షం’పై  జనం బాగానే ఆశలు పెట్టుకున్నారు.  స్పేస్ కు సంభందించిన పెద బాలశిక్ష లాంటిది మనకు అందివ్వబోతున్నాడని ఫిక్స్ అయ్యారు.   వారి అంచనాలు నిజమయ్యాయా...అది బాలశిక్ష లేక ప్రేక్షకుల పాలిట శిక్షా? అనేది రివ్యూలో చూద్దాం. 

కథేంటి

ఆంద్రప్రదేశ్ స్పేస్ సెంటర్ లో ఉన్న సైంటిస్ట్ లకు ఓ విషయం కంగారుపెడుతుంది. అదేమిటంటే...తాము ప్రవేశపెట్టిన శాటిలైట్ మిహిర దారి తప్పిందని... కక్ష్య వదిలిందని..దాంతో  ప్రపంచంలో ఉన్న కమ్యునికేషన్ వ్యవస్దకు పెద్ద విఘాతం కలగబోతోందని తెలుస్తుంది. దాంతో దాన్ని స్పేస్ లోకి వెళ్లి కోడింగ్ సరిచేసి  సెటిరైట్ చేసేదెవరు అని ఆలోచిస్తే..వాళ్లకు తట్టిన ఒకే ఒక పేరు దేవ్ (వరుణ్ తేజ). దేవ్ తమ ఆఫీస్ లో ఉంటే వెంటనే పిలిచి ఆ పని అప్పచెప్పేవారు. కానీ అతను 5 ఏళ్ల క్రితమే పర్శనల్ కారణాలతో జాబ్ వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో.. తెలియాలి....ఈ పని చేయటానికి ఒప్పుకోవాలి. 

అందుకోసం మరో వ్యామోగామి రియా (అతిథి రావు హైదరీ) రంగంలో కి దిగుతుంది. అతన్ని పట్టుకుని ఒప్పిస్తుంది. అక్కడ నుంచి దేవ్ ..స్పేస్ లోకి వెళ్లి మిహరను ఎలా సెట్ చేసాడు. ఆ ప్రాసెస్ లో అతనికే ఏ సమస్యలు ఎదురయ్యాయి...అసలు అతను ఉద్యోగం వదిలేసి వెళ్లిపోవటానికి కారణం ఏమిటి...శాటిలైట్ ని సెట్ చేసాక..అతను ఏం చేసాడు..వెనక్కి వచ్చాడా ..లేక అతని మనస్సులో వేరే ఆలోచన ఉందా, సినిమాలో లావణ్య త్రిపాఠి పాత్ర ఏమిటి,సెకండాఫ్ లో కీలకంగా నిలిచే విప్రయాన్ మ్యాటర్ ఏంటి  వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

 

ఎలా ఉంది...

కథ ఎత్తుగడ ..జేమ్స్ బాండ్ తరహా గూఢచారి  సినిమాలను గుర్తు చేసింది. జేమ్స్ బాండ్ ...ఓ ప్రాజెక్టు పూర్తి చేసి ..రెస్ట్ తీసుకోవటమో ..లేక పర్శనల్ కారణాలతో తన వృత్తికి దూరంగా ఉండటమో చేస్తారు. అప్పుడు వాళ్ల ఛీప్ ఎక్కడున్నాడో వెతికి..అతన్ని ...ఇది నువ్వు మాత్రమే చెయ్యగల మిషన్, ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేరు అని అప్పచెప్తారు. అలాగే ఇందులో హీరో కూడా పర్శనల్ కారణాలతో స్పేస్ సెంటర్ కు దూరంగా ఉంటాడు.

అతన్ని వెతికి పట్టుకుని  మిషన్ అప్పచెప్తారు. అంతవరకూ బాగానే ఉంది. అంటే సినిమా...ఆ మిషన్ పూర్తైపోవటంతోనే పూర్తవ్వాలి. కానీ ఆ మిషన్ పూర్తైన తర్వాత...కథని ఫినిష్ చేయకుండా... అక్కడ నుంచి హీరో కు మరో లక్ష్యం ఉన్నట్లు ..దానికోసం అతను ప్రయత్నం మొదలెట్టినట్లు కథను ఎక్సటెండ్ చేసారు. దాంతో అక్కడిదాకా టెంపోతో ఉన్న కథ ఒక్కసారిగా డ్రాప్ అవటం స్టార్ట్ అయ్యింది. రెండో కథ కనెక్ట్ కాలేదు. అప్పటికీ ఆ రెండో కథకు సంభందించిన విషయాలు ఫస్టాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో కలిపారు కానీ..ఫలితం లేకుండా పోయింది. 

 

మెచ్చుకోవాల్సిన విషయం

తెలుగు సినిమా కొత్తదారిలో వెళ్తోందంటూ క్యారక్టరైజేషన్స్ మార్చి అవే కథలు కొత్త దర్శకులు వడ్డిస్తున్న ఈ టైమ్ లో ...సంకల్ప్ నిజంగానే కొత్తదనం ఏమిటో తెలుగు తెరకు ఘాజీతో పరిచయం చేసారు. అలాగే ఇప్పుడు అంతరిక్షం తో మరోసారి ఇలాంటి కథలు కూడా మనం తీయగలం..కేవలం ఇవి హాలీవుడ్ వాళ్లు మాత్రమే చేయదగ్గ కథలు కాదు అని నొక్కి చెప్పినట్లు అయ్యింది. ఆ విషయంలో సంకల్ప్ ని మెచ్చుకోకుండా ఉండలేం.

 

మాస్ ఎలిమెంట్స్

ఇక ఇలాంటి సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ఆశించటం అంత బుద్ది తక్కువ పని మరొకటి ఉండదు. ఆ విషయంలో సంకల్ప్ కు స్పష్టత ఉంది. ఎక్కడా కమర్షియాలిటి కోసం కక్కుర్తి పడి ...శాటిలైట్ పై ఐటం సాంగ్స్, ఎలియన్స్ తో ఫైట్స్ పెట్టలేదు.  ఎలాగూ ఇలాంటి సినిమాలు అన్ని వర్గాలకు చేరటం కష్టమే కాబట్టి ఇలా ఎవిరిని టార్గెట్ చేసారో వారికి తగినట్లు  ఉండటమే బెస్ట్. 

 

వరణ్ తేజ్ ఎలా చేసాడు

అద్బుతంగా ఫెరఫార్మెన్స్ చేసాడని చెప్పలేం కానీ ..ఇలాంటి సబ్జెక్టు ఎంచుకునే అతను సగం మార్కులు వేయించుకున్నారు. మిగతా సగం...సినిమాలో అతి చెయ్యని నటనతో నిలబెట్టాడు. హీరోయిన్స్ పాత్రలు డిజైనింగ్ ఇంకా బాగా చేసి ఉండాల్సిందేమో అనిపించింది. అప్పటికీ అతిథి రావు హైదరీ... తన స్క్రీన్ ప్రెజన్స్ తో హైలెట్ అయ్యింది. లావణ్య ది చాలా చిన్న పాత్ర. మిగతా సీనియర్స్...ఎప్పటిలాగే చేసుకుంటూపోయారు.

 

టెక్నికల్ గా 

వాస్తవానికి ఇలాంటి సినిమాలకు విఎఫ్ ఎక్స్ విభాగం మంచి అవుట్ ఫుట్ ఇవ్వాలి. కానీ బడ్జెట్ కంట్రోల్ పెట్టారో లేక సరైన విఎఫ్ ఎక్స్ టెక్నీషియన్స్ దొరకలేదో కానీ ..పూర్ గా ఉంది. మిగతా విభాగాలు సినిమాలో కంటెంట్ ని రిచ్ గా ఎలివేట్ చేయటంలో సాయం చేసాయి. అయితే సెకండాఫ్ లో బోర్ కొట్టే సన్నివేశాలను గమనించి ఎడిట్ చేస్తే మరింతగా సినిమా నచ్చేది.

 

ఫైనల్ ధాట్

డైరక్టర్, రైటర్  ఎంత రీసెర్చ్ చేసినా జనాలకు ఎంత నాలెడ్జ్ కావాలో అంతే సినిమాలో ఇమడ్చాలి.  లేకపోతే వాళ్లు థియోటర్ లో సినిమా చూడటం మానేసి  గూగుల్ సెర్చ్ చేసుకుంటూ కూర్చోవాల్సి వస్తుందని మర్చిపోకూడదు.  

రేటింగ్: 2.5/5 

ఎవరెవరు

నటీనటులు : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అతిధి రావ్, సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ తదితరులు.

సంగీతం : ప్రశాంత్ విహారి

సినిమాటోగ్రఫర్ : జ్ఞాన శేఖర్ వి.యస్

ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్ 

నిర్మాత : రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి

దర్శకత్వం : సంకల్ప్ రెడ్డి