ఈ మధ్యన తెలుగు సినిమాలను భారీగానే చెన్నైలో రిలీజ్ చేస్తున్నారు. చెన్నైలో తెలుగు వాళ్లు ఎక్కువ మంది ఉండటంతో అక్కడ సినిమా టాక్ బాగుంటే బాగా ఆడి డబ్బులు తెచ్చిపెడుతున్నాయి. ఈ నేఫధ్యంలో అంతరిక్షం సినిమాని సైతం అక్కడ మంచి రేటుకే బిజినెస్ చేద్దామని నిర్మాతలు ప్రయత్నం చేసారు.

45 లక్షలు అక్కడ రైట్స్ కు అడిగారని, అయితే అక్కడ వరుణ్ తేజకు పెద్దగా మార్కెట్ లేకపోవటం, ఆల్రెడీ ఇలాంటి సబ్జెక్టుతో టిక్..టిక్..టిక్ చిత్రం రావటంతో ఆ రేటు పెట్టి తీసుకోవటానికి డిస్ట్రిబ్యూటర్స్ ఉత్సాహం చూపలేదు. దాంతో నిర్మాతలే స్వయంగా రిలీజ్ చేసారు. కానీ ఈ సినిమాకు ఓపినింగ్స్ రాలేదు. కలెక్షన్స్ చాలా నామ మాత్రంగా ఉన్నాయి. చాలా చోట్ల ప్రింట్ ఖర్చులు, థియోటర్ రెంట్స్ కూడా రికవరీ అవటం కష్టమని చెన్నై వర్గాల సమాచారం. 

ఇక జీరో గ్రావిటీలో ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన స్పేస్ సెట‌ప్‌లో ఈ అంత‌రిక్షం సినిమాను చిత్రీక‌రించారు ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి. ఈ చిత్రం కోసం అత్యున్న‌త సాంకేతిక విభాగం ప‌ని చేశారు. హాలీవుడ్ యాక్ష‌న్ నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అంత‌రిక్షం చిత్రానికి  యాక్ష‌న్ ఎపిసోడ్స్ చిత్రీక‌రించారు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్ర‌ధానాక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. అయితే ఎన్ని ఉన్నా..సినిమాలో సరైన కథ,కథనం లేకపోవటంతో జనాలకు పెద్దగా కనెక్ట్ కాలేదు.

ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి, సాయిబాబు జాగ‌ర్ల‌మూడి, వై రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. జ్ఞాన‌శేఖ‌ర్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ప్ర‌శాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు.