Asianet News TeluguAsianet News Telugu

"అంధగాడు" మూవీ రివ్యూ

  • చిత్రం : అంధగాడు
  • జానర్ : కామెడీ ఎంటర్టైనర్
  • తారాగణం : రాజ్ తరుణ్, హెబ్బా పటేల్, రాజేంద్రప్రసాద్, ఆశిష్ విద్యార్థి, శియాజీ షిండే
  • సంగీతం : శేఖర్ చంద్ర
  • దర్శకత్వం : వలిగొండ శ్రీనివాస్
  • నిర్మాత : సుంకర అనిల్, రామబ్రహ్మం
  • ఏసియానెట్ రేటింగ్ : 2.5/5
ANDHAGAADU movie review

కథ :
గౌతమ్( రాజ్ తరుణ్) ఈ శారదాదేవి అంధుల ఆశ్రమంలో తనలాంటి గుడ్డివారితో కలిసి పెరిగే పిల్లాడు. తను ఎంతో ఇష్టపడే ఫ్రెండ్స్‑కు కళ్లు వస్తున్నాయంటే ఆనందంగా వారిని హాస్పిటల్‑కు పంపిస్తాడు. అలా వెళ్లిన ఫ్రెండ్స్ తరువాత తనకు ఒక్క ఉత్తరం కూడా రాయకపోవటంతో వాళ్లను మర్చి పోవాలనే ఉద్దేశంతో ఆశ్రమం నుంచి వెళ్లిపోతాడు. విశాఖపట్నంలో ఓ ఎఫ్‑ఎమ్ చానల్‑లో ఆర్జేగా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా కళ్లు వస్తాయని ఎదురుచూస్తున్న గౌతమ్‑కు డాక్టర్ నేత్ర పరిచయం అవుతుంది. ఎలాగైనా నేత్రకు దగ్గరవ్వాలన్న ఉద్దేశంతో కళ్లున్నవాడిగా నటిస్తూ ఆమెను ప్రేమిస్తాడు. నేత్ర తన ప్రేమను చెప్పే టైంలో గౌతమ్ గుడ్డివాడన్న నిజం నేత్రకు తెలిసి అతన్ని వదిలి వెళ్లిపోతుంది.

తరువాత తనే దగ్గరుండి గౌతమ్ కు ఆపరేషన్ చేయించి కళ్లు వచ్చేలా చేస్తుంది. గౌతమ్ కు కళ్లు వచ్చిన దగ్గర నుంచి అసలు సమస్య మొదలవుతుంది. ఓ ఆత్మ గౌతమ్ కు కనిపిస్తూ ఇబ్బంది పెడుతుంది. అంతేకాదు గౌతమ్ తో హత్యలు కూడా చేయిస్తుంది. నిజంగానే గౌతమ్ కు ఆత్మ కనిపిస్తుందా.? దుర్మార్గుడైన పంతం బాబ్జీకి గౌతమ్ కు ఉన్న సంబంధం ఏంటి..? చివరకు గౌతమ్ తో మాట్లాడుతున్న ఆత్మ కథ ఏంటి? అన్నదే మిగతా కథ.
 

నటీనటులు :
యంగ్ హీరో రాజ్ తరుణ్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్‑తో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో ఎమోషనల్ సీన్స్ లోనూ మెప్పించాడు. ముఖ్యంగా ఫస్ట్‑లో గుడ్డివాడిగా రాజ్ తరుణ్ పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయ్యింది. హెబ్బా పటేల్ గ్లామర్ తో ఆకట్టుకున్న నటిగా ప్రూవ్ చేసుకునేందుకు ఈ సినిమాలో కూడా చాన్స్ రాలేదు. కానీ రాజ్ తరుణ్‑కు పర్ఫెక్ట్ జోడిగా మరోసారి ప్రూవ్ చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ కామెడీ టైమింగ్ సినిమాలకు హెల్ప్ అయ్యింది. మెయిన్ విలన్‑గా రాజా రవీంద్ర ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా లుక్, బాడీ లాంగ్వేజ్‑తో మంచి విలనీ పండించాడు. ఇతర పాత్రల్లో శియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, సత్య తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు :
రచయితగా మంచి పేరున్న వెలిగొండ శ్రీనివాస్.. అంధగాడు సినిమాతో దర్శకుడిగానూ మంచి మార్కులు సాధించాడు. అయితే ఈ సినిమాలోనూ శ్రీనివాస్‑లోని రచయిత.. దర్శకుడిని డామినేట్ చేయటం విశేషం. రెగ్యులర్ రివేంజ్ డ్రామానే చివరి వరకు ఆసక్తికరంగా తెరకెక్కించటంలో వెలిగొండ శ్రీనివాస్ సక్సెస్ సాధించాడు. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ తోనూ డైరెక్టర్ మెప్పించాడు. ఫస్ట్ హాఫ్‑లో కామెడీ, ఎమోషనల్ సీన్స్‑తో ఆకట్టుకున్న శ్రీనివాస్, సినిమా ప్రీ క్లైమాక్స్‑కు చేరుతున్న దశలో కాస్త తడబడ్డాడు. అనవరమైన సీన్స్‑తో బోర్ కొట్టించాడు. అయితే క్లైమాక్స్ విషయంలో దర్శకుడు తీసుకున్న కేర్ సినిమాలో లోపాలన్ని మరిచిపోయేలా చేస్తుంది. శేఖర్ చంద్ర అందించిన సంగీతం పరవాలేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఏకె ఎంటర్‑టైన్మెంట్ నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి.


ప్లస్ పాయింట్స్ :

అంధగాడు సినిమాకు కామెడీయే ప్రాణంగా చెప్పాలి. రివెంజ్ స్టోరీయే అయినా కామెడీ ట్రాక్ ఎక్కువగా ఉండటం వల్లనే కలిసొచ్చింది. కామెడీ సీన్స్  కు సంబంధించిన స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ సీన్ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ప్రత్యేకంగా సత్య కామెడీ హైలైట్ గా నిలిచింది. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్, పాటలు కలిసొచ్చే అంశాలని చెప్పాలి.

మైనస్ పాయింట్స్ :

కామెడీ సినిమా కావటం వల్ల టైటిల్ పాత్రలో రాజ్ తరుణ్ అంధగాడుగా పర్ ఫెక్ట్ నటన ప్రదర్శించకున్నా.. ఆ కామెడీతో గట్టెక్కాడు. లేకుంటే వీడు గుడ్డోడేనా లేక గుడ్డోడిలా నటిస్తున్నాడా అనేలా ఉంది నటన. ఎందుకోగానీ.. హెబ్బాతో హ్యాట్రిక్ చిత్రాలు చేసినా ఈ సారి కెమిస్ట్రీ పెద్దగా ఇద్దరి మధ్య కుదరలేదా అనిపించింది. హెబ్బా కూడా ఇటు అందంతో ఆకట్టుకోలేకపోగా.. అభినయంతో మెప్పించేందుకు తెగ ట్రై చేసింది. పాటల్లో గ్లామర్ మరింతగా చూపించగలిగే అవకాశం ఉన్నా.. మేకప్, కాస్ట్టూమ్స్ లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పర్ ఫెకక్ట్ గా తీసుకోకపోవడంతో అందగత్తె అనుకునే హెబా డీగ్లామర్ గా కనిపించింది. ఇక రాజేంద్ర ప్రసాద్ పాత్రకు ట్విస్టులు ఎక్కువవటం బోరింగ్ గా అనిపిస్తుంది. ఇక రాజారవీంద్ర విలనిజం కూడా ఇంట్రడక్షన్ ఇచ్చిన రేంజ్ లో సినిమాలో కనిపించకపోవడం నిరాశపరుస్తుంది. ఇక లో బడ్జెట్ లో ఫినిష్ చేద్దామనుకున్న విషయం ఒకే లొకేషన్ లో బ్యాగ్రౌండ్ మార్చి అటు ఇటుగా చేసిన సీన్స్ గుర్తు చేస్తాయి. పైగా సెకండ్ హాఫ్ లెందీగా ఉండటం, ప్రీ క్లైమాక్స్‑కు ముందు బోరింగ్ సన్నివేశాలతో ప్రేక్షకుడు సినిమాతో కనెక్ట్ అయ్యేందుకు తెగ ఇబ్బందిపడేలా ఉంది.

చివరగా: 

గుడ్డిలో మెల్ల మేలనిపించే అంధగాడు 

Follow Us:
Download App:
  • android
  • ios