తీన్మార్‌ యాంకర్‌ సావిత్రి(శివజ్యోతి) టీటీడీ వివాదంలో ఇరుక్కుంది. శ్రీవారి ప్రసాదాన్ని అడ్డుకున్నాడంటూ కామెంట్‌ చేయగా, ఇప్పుడు ఆమె వీడియో సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చ అవుతుంది. 

టీటీడీ వివాదంలో యాంకర్‌ శివజ్యోతి

ప్రముఖ యాంకర్‌ సావిత్రి(శివ జ్యోతి) వివాదంలో ఇరుక్కున్నారు. యాంకర్‌ శివజ్యోతి తన భర్త, ఫ్రెండ్ తో కలిసి తిరుమల వెళ్లారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బయటకు వస్తూ భక్తుల కోసం అందిస్తున్న శ్రీవారి ప్రసాదం తీసుకున్నారు. అయితే ఈ సందర్భంగా శివ జ్యోతి ఫ్రెండ్‌ సోను ఆ ప్రసాదం తీసుకున్నారు. దీన్ని శివజ్యోతి వీడియో తీసింది. ఇందులో ఆమె భర్త గంగులీ కూడా ఉన్నాడు. ఫ్రెండ్‌ ప్రసాదం తీసుకుంటుండగా, `సోను కాస్ట్ లీ ప్రసాదం అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్` అని నవ్వుతూ కామెంట్‌ చేసింది.

తిరుమలలో రిచెస్ట్ బిచ్చగాళ్లం

దీనికి ఫ్రెండ్‌ సోను స్పందిస్తూ, `జీవితంలో ఎప్పుడూ అడుక్కోలేదు. ఫస్ట్ టైమ్‌ అడుక్కున్నా` అంటూ రియాక్ట్ అయ్యాడు. దీనికి శివజ్యోతి నవ్వుతూ స్పందించింది. `తిరుపతిలో రిచెస్ట్ బిచ్చగాళ్లం` అని కామెంట్‌ చేయగా, `అడుక్కున్నా కానీ, బాగుంది గాయ్స్` అంటూ సోను చెప్పడం గమనార్హం. దీన్ని శివజ్యోతినే వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా, ఈ వీడియోని చూసిన భక్తులు, హిందూ సంఘాలు ఆమెపై మండిపడుతున్నారు. ట్రోల్‌ చేస్తున్నారు.

యాంకర్‌ శివజ్యోతిపై భక్తులు ఫైర్‌

పవిత్రమైన తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అడుక్కున్నామని అంటారా అంటూ నెటిజన్లు(భక్తులు) కామెంట్లు చేస్తున్నారు. శ్రీవారి ప్రసాదాన్ని, భక్తులను శివజ్యోతి అవమానించిందంటున్నారు. ఇది ఆమె నిజస్వరూపం అంటూ కామెంట్‌ చేస్తున్నారు. భక్తులను బిచ్చగాళ్లతో పోల్చడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమని తాము బిచ్చగాళ్లతో పోల్చుకున్నా, అది అందరికి వర్తిస్తుందనే కోణంలో నెటిజన్లు వీరిపై మండిపడుతున్నారు. శ్రీవారి ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీరిపై టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు. మొత్తంగా శివజ్యోతి వీడియో ఇప్పుడు వివాదానికి కారణమయ్యింది.

తీన్మార్‌ షోతో సావిత్రిగా పాపులర్‌ అయిన శివజ్యోతి

శివజ్యోతి.. `తీన్మార్‌` సావిత్రిగా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఆమె బిత్తిరి సత్తితో కలిసి `తీన్మార్‌` ప్రోగ్రామ్‌ని హోస్ట్ చేశారు. ఈ షోతోనే ఈ ఇద్దరు పాపులర్‌ అయ్యారు. పొలిటికల్‌ సెటైరికల్‌గా వీ6లో ఈ షోని నిర్వహించారు. ఈ షోతోనే టీవీ కూడా బాగా రన్‌ అయ్యింది. అయితే చాలా రోజుల క్రితమే ఈ షో నుంచి ఇద్దరు తప్పుకున్నారు. ఆ తర్వాత శివ జ్యోతి ఇతర షోస్‌లో పాల్గొంటూ సెలబ్రిటీగా రాణిస్తుంది. సావిత్రి బిగ్‌ బాస్‌ సీజన్‌ 3లోనూ కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఇది ఆమెకి విశేషమైన గుర్తింపుని తెచ్చిపెట్టింది. శివజ్యోతి యాంకర్‌గా స్పెషల్‌ ఈవెంట్స్ చేస్తోంది, అలాగే పలు షోస్‌లో గెస్ట్ గా మెరుస్తుంది. సోషల్ మీడియాలో వీడియోలు, రీల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం సావిత్రి ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. ఈ మేరకు యూట్యూబ్‌లో ఆమె వీడియో కూడా పెట్టింది. 

YouTube video player