యాంక‌ర్ ర‌వి.. ఈ పేరుకు ప్రత్యేకంగా ప‌రిచ‌యం అక్కర్లేదు. తెలుగు బుల్లితెర‌పై పటాస్ షో తో  త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ యాంక‌ర్. అయితే యాంకర్ గా ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో అంత‌కంటే ఎక్కువ వివాదాల‌తో  చెలరేగిపోతున్నాడు ర‌వి.  ఆ మధ్యన ఓ సినిమాలో హీరో గా చేసిన రవి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. 

వివరాల్లోకి వెళితే... యాంకర్‌ రవి  హీరోగా,  జోగులాంబ  క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తోటబావి’. గౌతమి హీరోయిన్. అంజి దేవండ్ల దర్శకుడు. ఆలూర్‌  ప్రకాష్‌గౌడ్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని హైదరాబాద్‌లో నృత్య దర్శకుడు శేఖర్‌ విడుదల చేశారు. 

యాంకర్ రవి   మాట్లాడుతూ ‘‘సినిమా పేరు కొత్తగా ఉంది. లుక్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నా’’ అన్నారు. దర్శకుడు  మాట్లాడుతూ ‘‘కొత్త కాన్సెప్ట్‌తో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘తోటబావి కథ ఏమిటి? అక్కడ ఏం జరిగిందన్నది తెరపైనే  చూడాలి. సెప్టెంబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

శివశంకర్‌ మాస్టర్‌, ఛత్రపతి శేఖర్‌, నర్సింహారెడ్డి, జబర్దస్త్‌ అప్పారావు, రాజమౌళి, రోహిణి తదితరులు  నటించిన ఈ చిత్రానికి సంగీతం: దిలీప్‌ బండారి, ఛాయాగ్రహణం: చిడతల నవీన్‌.